
- మంచిరేవుల ట్రెక్ పార్క్ బోనులో ప్రత్యక్షం
- వైద్య పరీక్షల కోసం జూపార్కుకు..నాగార్జున సాగర్ సమీపంలో
- అడవిలో వదిలిన అటవీ శాఖఊపిరి పీల్చుకున్న స్థానికులు, అధికారులు
గండిపేట్, వెలుగు: గత 25 రోజులుగా నార్సింగి ప్రాంతంలో తిరుగుతూ స్థానికుల్లో దడ పుట్టిస్తున్న చిరుత పులి ఎట్టకేలకు చిక్కింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల ట్రెక్‌పార్కులో ఏర్పాటు చేసిన బోనులో ఎరగా వేసిన మేక కోసం వచ్చి పట్టుబడింది. బుధవారం అర్ధరాత్రి బోనులో పడడంతో గురువారం ఉదయం ఆరు గంటలకు బోన్లను పరిశీలించేందుకు అటవీ శాఖాధికారులు, సిబ్బంది వెళ్లగా కనిపించింది. దీంతో సుమారు నెల రోజుల నిరీక్షణకు ఫలితం దక్కడంతో అధికారులతో పాటు సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి సూచన మేరకు చిరుతను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. చిరుతకు బయటి పరిసరాలు కనిపించకుండా, బయటి వ్యక్తులకు చిరుత అన్నది తెలియకుండా బోను చుట్టూ సంచులు కట్టి ముందు జూపార్కుకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి నాగార్జునసాగర్ ఫారెస్ట్ పరిధిలోని కంబాలపల్లి బీట్ చందంపేట అడవుల్లో వదిలేశారు.
సుమారు నెల పాటు హడలెత్తించింది...
చిరుత కనిపించిందని సమాచారం ఇచ్చినప్పటి నుంచి ఫారెస్ట్‌అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 24 గంటల పాటు నిఘా పెట్టారు. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎటు నుంచి వస్తుందో తెలియక స్థానికులు, అధికారులు హడలెత్తిపోయారు. పలు చోట్ల బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక్క మంచిరేవుల ట్రెక్‌పార్కులోనే 14 ట్రాక్ కెమెరాలు, రెండు ట్రాప్బోన్లు పెట్టి అందులో మేకలను ఎరగా పెట్టారు. హిమాయత్‌సాగర్ సమీపంలో జూలై 9న పులి జాడలు కనిపించాయి. వ్యాస్‌నగర్‌లోని గ్రేహౌండ్స్క్యాంపస్లోకి వెళ్లిందని తెలియడంతో అక్కడికి వెళ్లి అడుగులను గుర్తించారు. 24న అర్ధరాత్రి ఓఆర్‌ఆర్ నుంచి ఫారెస్ట్ ట్రెక్పార్కువైపు వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. చివరకు ట్రెక్‌పార్కులో పెట్టిన బోనులో ఎరకు చిక్కింది.
చైతన్యపురి మూసీ నదిలో మొసలి!
దిల్ సుఖ్ నగర్, వెలుగు: చైతన్యపురిలోని మూసీ పరివాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా మొసలి ఉన్నట్టు వార్తలు వస్తుండడంతో స్థానికులు అటు వైపు వెళ్లడానికి భయపడిపోతున్నారు.గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని ఫణిగిరి కాలనీ మూసీ ఒడ్డున ఉన్న శివాలయం సమీపంలో మొసలి కనిపించింది. దీంతో చైతన్యపురి పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. వారితో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మొసలి తిరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఉప్పల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. నీళ్లలో ఉన్నప్పుడు మొసళ్లను పట్టుకోవడం సాధ్యం కాదని, ఒడ్డుకు చేరినప్పుడు పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేస్తామన్నారు. అది తిరుగుతున్న ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు తోట మహేశ్‌యాదవ్, నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డి, అజయ, మోహన్ ఉన్నారు.
బిక్కుబిక్కుమంటూ బతికాం
చిరుత ఉన్నట్లు తెలియడంతో భయంతో గడపాల్సి వచ్చింది. గండిపేట్, గోల్కొండ, నార్సింగి, మంచిరేవుల ట్రెక్పార్కు, వ్యాస్ నగర్ గ్రేహౌండ్స్‌లో కూడా పులి కనిపించిందని మా వాట్సాప్‌గ్రూపుల్లో చూసి హడలిపోయా... ఇన్ని రోజులు బయటకు వెళ్లడానికే వీలు లేకుండా పోయింది. సాయంత్రం కాగానే డోర్లు మూసుకుని ఉన్నాం. ఉదయం ఎండ వచ్చాకే కాలు బయట పెట్టేవాళ్లం. మొత్తానికి చిరుత దొరికింది..మా టెన్షన్తీరింది. – మౌనిక, మంచిరేవుల
ఇగ వాకింగ్ స్టార్ట్ చేస్తం
మంచిరేవుల ట్రెక్‌పార్కులో రోజుఉదయం, సాయంత్రం వాకింగ్చేసేటోన్ని. చిరుత పులి ఉన్నట్లు తెలిసినప్పటి నుంచి వాకింగే బంద్చేసినం. 25 రోజుల నుంచి పులి ఎప్పుడు దొరుకుతుందా అని మా వాకర్స్చూస్తున్నారు. చివరకు దొరికిందని తెలిసి సంతోషించినం. ఇక భయం లేకుండా వాకింగ్ మొదలుపెడతం – ప్రవీణ్, నార్సింగి