ఎక్కడుందో? ఎటు నుంచి వస్తదో! .. చిరుత సంచారంతో స్థానికుల్లో వణుకు

ఎక్కడుందో?  ఎటు నుంచి వస్తదో! .. చిరుత సంచారంతో స్థానికుల్లో వణుకు
  • మంచిరేవుల, గోల్కొండ వాసుల్లో భయం
  • ఉదయం 8 గంటలకు బయటకు..
  •  సాయంత్రం 6 గంటలకే ఇంటికి... 
  • 2 బోన్లు, 14 ట్రాప్ ​కెమెరాలు పెట్టినా చిక్కుతలేదు  
  • ఇప్పటికే రెండు పార్కులు మూసివేత 

గండిపేట, వెలుగు: మంచిరేవుల, గోల్కొండ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందోనని స్థానికులు వణికిపోతున్నారు. శివారు ప్రాంతం కావడం, పార్కులు, అటవీ ప్రాంతం ఉండడంతో ఎక్కడ ఉందోనని భయపడిపోతున్నారు. దీంతో ఉదయం ఎనిమిది గంటలైతే గానీ ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. అలాగే, రాత్రి ఆరు, ఏడు గంటలకే ఇండ్లలోకి వెళ్లి తలుపులు మూసుకుంటున్నారు. దాదాపు ఐదారు ప్రాంతాల్లో పులి కనిపించడంతో ఒక్క పులి కాదని, ఐదారు వరకు పులులు వచ్చి ఉంటాయిన అనుమానపడుతున్నారు. కానీ, అన్నిచోట్ల కనిపించే పులి ఒక్కటేనని అటవీశాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. 

ఎక్కడి నుంచి.. ఎందుకు వచ్చినట్టు?  

చిరుత పులులు తాము ఇంతకుముందు ఏర్పాటు చేసుకున్న ఆవాసం (షెల్టర్) సురక్షితమైనది కాదని భావించినప్పుడు, ఆహారం దొరకనప్పుడు ఇతర ప్రాంతాల్లోకి వెళ్తుంటాయి. నగరం చుట్టూ ఇంతకుముందున్న అడవులు, గుట్టలు తగ్గిపోవడం, నివాస ప్రాంతాలు విస్తరిస్తుండడంతో చిరుతలు తమ సహజ ఆవాసాల నుంచి జనావాసాలకు చేరుకుంటున్నాయి. అలాగే, అడవుల్లో జింకలు, అడవి పందులు తగ్గడం వల్ల కుక్కలు, గొర్రెలు, మేకలు, పశువుల కోసం నగర శివార్లకు చేరుకుంటున్నాయి. 

ఈ కారణాల వల్లే చిరుత వికారాబాద్​అటవీ ప్రాంతం నుంచి మంచిరేవుల, గోల్కొండ ప్రాంతాలకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మంచిరేవుల ట్రెక్​పార్కుతో పాటు చిలుకూరు మృగవణి పార్కులు ఉండడం, ఇందులో జింకలు, ఇతర జంతువులు ఉండడం వల్ల ఇటువైపు వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. అలాగే గ్రేహౌండ్స్​వ్యాస్​నగర్​లో కుందేళ్లు, అడవి పందులు ఉండడం, మంచిరేవుల విలేజ్​లో మేకలు, పశువులు, కుక్కలు ఉండడంతో వచ్చి ఉండవచ్చని ఫారెస్ట్​అధికారులు అనుకుంటున్నారు. 

రాత్రి పూటే ఎందుకు తిరుగుతాయంటే​.. 

చిరుత పులులు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాయి. అలాగే, మనుషుల సంచారం తక్కువగా ఉండే రాత్రిళ్లు, తెల్లవారుజామున మాత్రమే తిరగడానికి ఆసక్తి చూపిస్తాయి. ఫారెస్ట్ ఆఫీసర్లు పలు చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కూడా రాత్రివేళ, తెల్లవారుజామునే ఈ చిరుత కనిపించింది. తన ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు, ఆహారం కోసం చిరుత ఇన్ని ప్రాంతాలను చుట్టి వస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

ఎక్కడెక్కడ కనిపించిందంటే..

నార్సింగిలోని టెక్ పార్క్, మంచిరేవులలోని గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గోల్కొండ ప్రాంతాల్లో పులి తిరిగినట్టు సీసీ కెమెరాల్లో కదలికలు రికార్డయ్యాయి. గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో జులై 28న రోడ్డు దాటుతూ కనిపించింది. ఈ పులి తారామతి బారాదరి సమీపంలో మూసీ నది వైపు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఈ అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్న ఒక్కటేనని తేల్చారు. 

డ్రోన్​ కెమెరా ఉపయోగపడదా?  

పులిని పట్టుకోవడానికి అటవీశాఖాధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా రెండు బోన్లు, 14 ట్రాక్​కెమెరాలు ఏర్పాటు చేశామని, అయినా చిక్కడం లేదని చిలుకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ తెలిపారు. బోన్లలో మేకలను ఎరగా వేశామని, అయినా లాభం లేదంటున్నారు. మంచిరేవుల ట్రెక్​పార్కు, చిలుకూరు మృగవణి పార్కులను తాత్కాలికంగా మూసివేశామన్నారు. రాత్రిళ్లు, తెల్లవారుజామున బయటకు రావొద్దని స్థానికులను హెచ్చరించామని స్పష్టం చేస్తున్నారు. 

డ్రోన్​కెమెరాను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నా...దట్టమైన చెట్లు, ఇండ్లు ఉండడం వల్ల కనిపించే అవకాశం లేదని భావిస్తున్నారు. పగలు మొత్తం పడుకునే ఉంటుందని, రాత్రి వేళలో డ్రోన్​కెమెరాలో కనిపించే అవకాశం లేదంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో బోన్లలో చిక్కుతుందని భావిస్తున్నామన్నారు.  

శివార్లలోకి వచ్చిన చిరుతలివే..

గతంలో కూడా నగర శివారు ప్రాంతాల్లో చిరుత పులులు సంచరించిన ఆనవాళ్లున్నాయి. ఈ నెల 11న బాలాపూర్ రీసెర్చ్​సెంటర్​వద్ద రెండు చిరుతలు కనిపించాయి. డిఫెన్స్ లాబొరేటరీస్ స్కూల్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది చిరుతలను గుర్తించారు..అటవీ శాఖాధికారులు ట్రాప్​కెమెరాలు ఏర్పాటు చేసినా రికార్డు కాలేదు..ఇప్పటికీ చిక్కలేదు. ఏప్రిల్​16న పటాన్​చెరు సమీపంలోని ఐసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏటీ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఆరిడ్ ట్రాపిక్స్) క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ చిరుత చిక్కింది. 

దీన్ని నెహ్రూ జూపార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించి, ఆరోగ్య పరీక్షల తర్వాత అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విడుదల చేశారు. అయితే, ఇక్కడ మరో చిరుత కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శంషాబాద్​ఎయిర్​పోర్ట్​సమీపంలో 2024 ఏప్రిల్​27న ఒక చిరుత కనిపించగా, అటవీ శాకాధికారులు పట్టుకున్నారు.