కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

మనదేశంలో మే డే నిర్వహించి నేటితో100 ఏండ్లు పూర్తయ్యాయి. 1923లో అప్పటి మద్రాసు నగరంలో కామ్రేడ్ ఎం.సింగరవేలు ఎర్రజెండా ఎగుర వేశారు. 1886లో చికాగోలో జరిగిన కార్మికుల ప్రదర్శన ఈ మే డే పుట్టుకకు నాంది పలికింది. 8 గంటల పని దినం, కార్మిక హక్కుల గురించి నినదిస్తూ 1886, మే 1న వేలాది మంది కార్మికులు పోరాటం ప్రారంభించారు. దీనికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత చికాగో నగరంలోని హే మార్కెట్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆనాటి పాలకవర్గం ఆదేశాలతో పోలీసులు ప్రదర్శనకారులపై విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఒక పోలీసును హత్య చేశారనే నిరాధార అభియోగంతో కార్మిక నాయకులను ఉరి తీశారు. ఆ పోరాటంలో చికాగో అమరులు నినదించిన ‘ప్రపంచ కార్మికులారా! ఏకంకండి’ అనే నినాదం విశ్వవ్యాప్తమై మారుమోగింది. శ్రామికవర్గంలో చైతన్యాన్ని రగుల్కొల్పింది. ఈ శ్రామికవర్గ విజయానికి చిహ్నంగా 8 గంటల పని దినం చట్టబద్ధత పొందింది. అదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవానికి అంకురార్పణ అయింది.1890 మే 1వ తేదీన అమెరికా కార్మిక సంస్థ ఏటా మే1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరపాలని పిలుపునిచ్చింది. ఇండియాలో మద్రాసు కేంద్రంగా 1923 మే 1న కమ్యూనిస్టు నాయకుడు సింగరవేలు నాయకత్వంలో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందూస్థాన్ మే డేను నిర్వహించింది. 

దోపిడీ.. అసమానతలు

నేడు శ్రామికవర్గం, రైతాంగం ఉత్పత్తి చేస్తున్న అపార సంపద, మానవాళి సాధించిన అపూర్వమైన శాస్త్ర సాంకేతిక పురోగతి ఫలాలు కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, కొన్ని పెద్ద కార్పోరేట్లు చేజిక్కించుకుంటున్నాయి. అసమానతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఉద్యోగాలు కోల్పోవడం, నిరుద్యోగం, తక్కువ ఉపాధి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సంపదను ఉత్పత్తి చేసే వారు పేదరికంలోకి జారుతున్నారు. పెట్టుబడిదారీ దేశాల్లో ప్రభుత్వాలు నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేస్తూ బడా పెట్టుబడిదారీ వర్గానికి బహిరంగంగా తమ మద్దతు తెలుపుతున్నారు. కొందరి చేతుల్లోనే సంపద, వనరులు కేంద్రీకృతమై ఉన్నాయి. మే డే సందర్భంగా ప్రజల్లో అలాంటి విషయాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 5 న దేశ రాజధానిలో జరిగిన మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీలో  సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూలకు చెందిన వేలాది మంది భారీ ప్రదర్శన నిర్వహించారు. దేశంలో కార్మికులను మతం ప్రకారం విడగొట్టడమే లక్ష్యంగా ఉపాధి సంబంధాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. పని ప్రదేశాల్లో ఎలాంటి హక్కులు లేకుండా బానిసలుగా మారుస్తున్నారు, అదే సమయంలో అమలులో ఉన్న అన్ని చట్టాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. లేబర్ కోడ్ లలో మార్పు ఇప్పటికే ప్రారంభమైంది. దానికి సంబంధించి పాలనాపరమైన, శాసనపరమైన చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పని గంటల పెంపు, ఇతర సర్వీస్ కండిషన్లను కుదించేశారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించడం, ప్రత్యామ్నాయ, విధానాల కోసం కార్మికవర్గ పోరాటాలను ఉధృతం చేయడమే నేడు మన ముందు ఉన్న కర్తవ్యం. ఈ కర్తవ్య సాధన కోసం కార్మికవర్గం  కార్యోన్ముఖులై మేడే స్ఫూర్తితో పోరాటాలకు  కదిలి రావాలి.
-
యాటల సోమన్న,సీఐటీయూ 
రాష్ట్ర కమిటీ సభ్యుడు