చెత్తేరుకున్న అమ్మాయి.. షెఫ్ అయింది!

చెత్తేరుకున్న అమ్మాయి.. షెఫ్ అయింది!

విధి ఒక్కోసారి అదృష్టాన్ని మన దగ్గర్నుంచి లాక్కొని దురదృష్టాన్ని గిఫ్టుగా ఇస్తుంది. కానీ.. అదృష్టం మాత్రం ఏదో మార్గం గుండా తిరిగి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. లిలిమా ఖాన్ జీవితంలో కూడా ఇదే జరిగింది. నాలుగేండ్ల వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టు కొని రోడ్డున పడింది. చెత్తకాగితాలు ఏరుకొని పొట్ట నింపుకుంది. కానీ.. ఇప్పుడు స్టార్ హోటల్లో షెఫ్ అయింది. రకరకాల వంటలు వండి.. పదిమంది కడుపు నింపుతోంది.

‘ఒకప్పుడు నేను డస్ట్​బిన్ లో పశువుల కోసం పారేసిన వేస్ట్​ఫుడ్ తిన్నా . దాని కోసం కూడా తోటివాళ్లతో కొట్లాడాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు నేను కొన్ని వందల మంది కోసం వంట చేస్తున్నా ’ అంటోంది 25 సంవత్సరాల లిలిమాఖాన్. నాలుగు సంవత్సరాల వయసులోనే లిలిమా తల్లిదండ్రులను కోల్పోయి, ఒంటరిగా మిగిలింది. ఢిల్లీ వీధుల్లో దిక్కులేని జీవితం గడిపింది. దొరికింది తిని,
ఫుట్ పాత్ మీదే పడుకునేది. చెత్త ఏరుకొని అది అమ్మితే వచ్చిన డబ్బులతో ఏదైనా తినేది. చిన్నవయసులోనే లిలిమా ఖాన్ ఎన్నో బాధల్ని అనుభవించింది. ఆమె ఫుట్ పాత్ మీద పడుకుంటే.. ఆమె పక్కనే కుక్కలు పడుకునేవి. కొన్ని సార్లు మెలకువ వచ్చి చూసేసరికి పక్కనే తాగుబోతులు పడుకొని ఉండేవారు. ఫుట్ పాత్ మీద పడుకున్న వాళ్లందర్నీ మున్సిపాలిటీ వాళ్లు పొద్దున్నే నాలుగు గంటలకు లేపేవాళ్లు. లేవగానే వాళ్లతో పాటు సంచి తీసుకొని చెత్త ఏరడానికి పోయేది లిలిమా. అప్పటి నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఎక్కడెక్కడో తిరుగుతూ చెత్త ఏరుకునేది.

ఆకలేసి అన్నం అడిగితే ఎవరూ పెట్టేవాళ్లు కాదు. చాలాసార్లు ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలని ఆలోచించేది. కానీ.. మార్గమేది? రోడ్డు పక్కన ఫుట్ పాత్ ల నుంచి ఫ్లైఓవర్ల కిందకు మారింది.రాత్రిళ్లు అక్కడే పడుకునేది. ఆకలేసినప్పుడు తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని రెస్టారెంట్లకు దగ్గరలో ఉన్న చెత్తకుండీల్లో వెతికేది. అలా లిలిమాకు పదకొండేళ్లు నిండాక కిల్కారి రెయిన్ బో హోమ్ అనే స్వచ్ఛంద సంస్థ వాళ్లు తీసుకెళ్లారు . అక్కడే ఆమెకు చదువు చెప్పించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు లిలిమా చదువుకుంది. ఆ టైంలో లిలిమాను చేరదీసి కన్నబిడ్డలా చూసుకున్న రుకయా అక్కడే క్యాంటిన్లో వంట చేసేది. ఆమెకు లిలిమా వంటపనుల్లో సాయం చేసేది. అలా కొన్నిరోజుల పాటు హోమ్ లో కుక్ గా పనిచేసింది.

‘క్రియేటివ్ సర్వీసెస్ సపోర్ట్’ అనే ఎన్జీవో గ్రూప్ ద్వారా ఇటాలియన్ రెస్టారెం ట్ లో స్టాఫ్ కుక్ గా ఉద్యోగంలో చేరింది. ఐదేండ్ల అనుభవం తర్వాత అక్కడే జూనియర్ చెఫ్ గా సేవలందించింది. ఇప్పుడు వసంత్ కుంజ్ మాల్ అనే స్టార్ హోటల్ లో జూనియర్ చెఫ్ గా పనిచేస్తున్నది. ఢిల్లీలో సీనియర్ షెఫ్ అయిన జులియా అనే మహిళా చెఫ్ దగ్గర లిలిమా ఖాన్ పనిచేస్తున్నది. ‘ఇప్పుడు నేను
చెఫ్ ని మాత్రమే.. ఫ్యూచర్ లో ఒక రెస్టారెంట్ ని ఎలా నడపాలో తెలుసుకుంటా. పెద్ద రెస్టారెంట్ కి హెడ్ చెఫ్ అవుతా. ప్రస్తుతం నేనొక కిరాయి ఇంట్లో ఉంటున్నా . బాగా కష్టపడి పనిచేసి హెడ్ షెఫ్ అవుతా. సొంత ఇంట్లో ఉంటూ.. నాలాంటి ఎంతోమందికి అండగా ఉంటా’ అంటున్నది లిలిమా ఖాన్ .

ప్రతీ ఒక్కరికి ఒక అవకాశం కావాలి. అప్పుడే తామేంటో నిరూపించుకోగలుగుతారు. లేదంటే.. కొన్ని సార్లు అన్నీ చేయగలిగి ఉండి కూడా ఏం చేయలేక చేతులు కట్టు కొని కూర్చోవాల్సి వస్తుంది. లిలిమా ఖాన్ కి కూడా ఎన్జీవో సాయం చేసి, రెస్టారెంట్ లో అవకాశం ఇప్పించి ఉండకపోతే అదే హోం లో పిల్లలకు వంట చేసి పెడుతూ ఉండేది. కానీ.. ఒక్క అవకాశం ఇప్పుడు ఆమెను ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తుల జాబితాలో చేర్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడితే ఉన్నత శిఖరాలకు ఎదగడం పెద్ద కష్టమేం కాదు అని నిరూపించింది లిలిమా.