
ఒకరు కంపెనీ సీఈవో. మరొకరు వైస్ ప్రెసిడెంట్. ఇంకొకరిది కేబినెట్ హోదా ర్యాంకర్. ఇలా విదేశాల్లో కీలక పదవులు అందుకుంటున్న మనవాళ్ల గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వింటూనే ఉంటాం. అసలింతకీ, ఇతర దేశాల్లో ఎంతమంది మనవాళ్లు కీలక పదవుల్లో ఉన్నారు? అనే డౌట్ వస్తుంది చాలామందికి. అమెరికాలో ఉన్న ‘‘ఇండియా డయాస్పొరా’’ అనే ఓ సంస్థకు కూడా ఇదే డౌట్ వచ్చింది. దాంతో సర్వే చేసింది. ఎక్కడెక్కడ మనవాళ్లున్నారో చెబుతూ ఓ లిస్ట్ రిలీజ్ చేసింది.
ఉన్నత చదువులు కోసమో, ఉద్యోగాల కోసమో దేశం విడిచి విదేశాలకు వెళ్లేవారు ఎక్కువ. కొంతమంది తిరిగి వస్తారు. మరికొంతమంది అక్కడే స్థిరపడతారు. వీళ్లలో కొంతమంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సీఈవోలు అవుతున్నారు. బడాబడా కంపెనీలు నిర్వహిస్తూ వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాదు, పెద్దపెద్ద పదవులు అందుకుంటూ ఆ దేశరాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. ఇలా15కు పైగా దేశాల్లో 200 మందికి పైగా భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక స్థానాల్లో ఉన్నారని ‘ఇండియా డయాస్పొరా’ జరిపిన సర్వేలో తేలింది. యూఎస్ వైస్‌ప్రెసిడెంట్ కమలా హారిస్, గూగుల్ సీఈవో సుందర్‌పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెండ్ల ఉన్నారు.
అన్నిరంగాల్లో..
అవకాశాల కోసం ఇతర దేశాలకు వెళ్లిన మనవాళ్లు ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పైపైకి వెళుతున్నారు. ఇప్పటివరకూ మూడు కోట్ల 20 లక్షల మంది విదేశాలకు వలస వెళ్లారని లెక్కలు చెబుతున్నాయి. వీళ్లలో చాలామంది ఎకానమీ, ఇండస్ట్రీస్, టెక్నాలజీ, విద్యారంగం, రాజకీయాలు..ఇలా అన్ని రంగాల్లో ముఖ్యమైన పాత్ర పోషించే స్థాయికి ఎదుగుతున్నారు. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, యుఏఈ, సింగపూర్, సౌత్ ఆఫ్రికా వంటి టాప్ దేశాల్లో పవర్ ఫుల్ లీడర్లుగా ఎదుగుతున్నారు. ఎన్ఆర్ఐలకు పుట్టిన పిల్లలు కూడా అమెరికా, సింగపూర్, దక్షిణాఫ్రికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారనేది ఈ సర్వే సారాంశం.
రోల్ మోడల్స్
‘‘వివిధ దేశాల్లో చక్రం తిప్పుతున్న భారత మూలాలున్న వ్యక్తులంతా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నారు. తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా పదవి అందుకున్న కమలా హారిస్ ఇండియన్స్‌కు రోల్ మోడల్‌గా నిలిచారు. ఆమెతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్లంతా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు’ అని అన్నారు ఇండియా డయాస్పొరా సంస్థ ఫౌండర్ ఎంఆర్ రంగస్వామి.
గర్వకారణం
‘‘ఇండియా డయాస్పొరా లిస్ట్‌లో నాపేరు ఉండటం చాలా గర్వంగా ఉంది. కాంగ్రెస్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ఇండో అమెరికన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాను. అమెరికా సొసైటీలో నాకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాను’’ అన్నారు యూఎస్ హౌస్ విదేశీ వ్యవహారాల చైర్మన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా. అలాగే ‘‘ఇండియా స్పోరా జాబితాలో తనని చేర్చడం గౌరవంగా ఉందని’’ సెనేటర్ రత్నా ఒమిద్వర్ చెప్పారు. అదేవిధంగా ‘‘సేవ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా దాన్ని అందుకోవాలని’’ ఒబామా పరిపాలనలో వాణిజ్య సహాయ కార్యదర్శిగా పనిచేసిన కేపీఎంజీ ఇండియా చైర్మన్, ఇండియా డయాస్పొరా బోర్డు మెంబర్ అరుణ్ కుమార్. అన్నారు.