
- ఏటా 10-30% ఫీజులు పెంచుతున్న మేనేజ్మెంట్లు
- పుస్తకాల నుంచి షూస్ దాకా అంతా స్కూళ్లలో కొనాల్సిందే
- ఫీజుల కట్టడిపై కమిటీలేసుడు తప్ప సర్కార్ చర్యల్లేవ్
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ ఫీజు రూ. 2.5 లక్షలు. ట్రాన్స్పోర్ట్, బుక్స్, డ్రెస్సులు, లంచ్ ఇతర ఫీజులు మరో రెండున్నర లక్షలు ఉంది. మొత్తం ఫీజు రూ.5 లక్షలు.
మేడ్చల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతికి ఫీజు రూ. 1.80లక్షలు.
ట్రాన్స్‌పోర్టు + లంచ్‌కు మరో రూ.1.80లక్షలు గా ఉంది. బుక్స్, యూనిఫామ్ కోసం రూ.25వేలు, ఇయర్లీ ఫీజు పేరుతో మరో రూ.25వేలు వసూలు చేస్తున్నారు.
మొత్తం ఫీజు రూ.4.10 లక్షలు
హైదరాబాద్‌లోని పేరున్న పలు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏడాది ఫీజు రూ. 50 వేల నుంచి రూ. 70 వేలు ఉంది. నాలుగేండ్లకు కలిపితే రూ. 3 లక్షలు. బీటెక్ మొత్తం ఫీజు కంటే ఎల్‌కేజీకే ఖర్చు ఎక్కువ.
రకరకాల పేర్లతో వసూళ్లు
స్కూళ్లలో పిల్లల్ని చేర్పించినప్పుడు ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని, నెలవారీగా ఫీజులు తీసుకోవాలని సర్కారు ఉత్తర్వులు చెప్తున్నాయి. కానీ.. అవి ఎక్కడా అమలవడం లేదు. డొనేషన్లు, డెవలప్మెంట్ ఫండ్, అడ్మిషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, కంప్యూటర్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, ల్యాబ్ ఫీజు ఇలా రకరకాల పేర్లతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ మెయిన్ ఫీజులకు సంబంధం లేకుండా తీసుకుంటున్నవే. చిన్న స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ వరకూ స్థాయికి తగ్గట్టు వేలు, లక్షల్లో పేరెంట్స్ నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ల ఫీజులకు అడ్డూ అదుపు లేకుండాపోతున్నది. నర్సరీ, ఎల్కేజీ చదువులకే లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. కొన్ని కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలోనైతే ప్రైమరీ క్లాసులకే రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ ఫీజు ఉంది. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా, స్కూళ్ల వెబ్సైట్లలో స్పష్టంగా కనిపిస్తున్నా రాష్ట్ర సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. అడిగేవారు లేకపోవడంతో మేనేజ్మెంట్లు ప్రైమరీ క్లాసులకే ఇంజినీరింగ్‌ను మించి ఫీజులు తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో సుమారు 11 వేల ప్రైవేటు స్కూల్స్ఉండగా, వాటిలో 30 లక్షలకు పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లు మినహా, మెట్రో నగరాల్లోని పలు స్కూళ్లలో ఫీజులు దారుణంగా ఉన్నాయి.
ఇష్టారాజ్యంగా పెంచుడు
అడ్మిషన్, స్పెషల్ ఫీజులను కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్లు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. దాదాపు మెజార్టీ ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఏటా10 నుంచి 30 శాతం ఫీజులు పెంచుతున్నాయి.
ఫీజుల విషయంలో సరైన రూల్స్ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొన్ని స్కూళ్లు మెయిన్ ఫీజులను తక్కువగా తీసుకొని, డెవలప్మెంట్ ఫండ్ పేరుతో అందినంత దండుకుంటున్నాయి. డెవలప్మెంట్ ఫండ్‌కు రశీదులంటూ ఏమీ ఇవ్వడం లేదు. జీవో నెంబర్ 1 ప్రకారం ఐదు శాతం లాభం ఉండేలా ఫీజులను తీసుకోవాలి. కానీ ఈ రూల్ ఏ స్కూల్లోనూ అమలు కావడం లేదు. ఫీజుల డీటెయిల్స్ బోర్డుల మీద పెట్టాలనే నిబంధనలను స్కూళ్లు పట్టించుకోవడం లేదు.
పుస్తకాల నుంచి షూస్ వరకూ వ్యాపారమే
చిన్నపిల్లలు తినే వస్తువులు సహా వేటినీ విద్యా సంస్థల్లో అమ్మొద్దని ఆదేశాలున్నాయి. కానీ, చాలా స్కూళ్లు తమ కాంపౌండ్లోనే అమ్ముతూ పెద్దవ్యాపారమే కొనసాగిస్తున్నాయి. పుస్తకాలు, యూనిఫామ్, నోట్ బుక్స్, స్టేషనరీ, షూస్, స్పోర్ట్స్ మెటీరియల్.. ఇలా అన్నీ బడుల్లో కొనాల్సిందేనని పేరెంట్స్‌కు తెగేసి చెప్తున్నాయి. వీటిని మార్కెట్ రేట్ల కంటే 30% నుంచి 80% వరకూ పెంచి అమ్ముతున్నాయి. చాలా స్కూళ్లు టెక్ట్స్ బుక్స్‌పై తమ స్కూళ్ల పేర్లు రాసి అమ్ముతున్నాయి. మరోపక్క సర్కారు ఆదేశాల ప్రకారం స్కూళ్లకు కేవలం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ అని మాత్రమే రాయాలి. కానీ చాలా స్కూళ్లు.. టెక్నో, మోడల్, ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలంపియాడ్ వంటి పేర్లను యాడ్ చేస్తున్నాయి.
చట్టం ఏమాయె?
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల కంట్రోల్ కోసం 2017లో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో సర్కారు ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం పక్కన పెట్టింది. జనవరిలో జరిగిన కేబినెట్ భేటీలో మాత్రం.. ఫీజుల కట్టడికి చట్టం తెస్తామని, చట్టం ఎలా ఉండాలనే దానికోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ కమిటీ మార్చి ఫస్ట్ వీక్‌లో భేటీ అయి, పలు ప్రతిపాదనలను సర్కారుకు ఇచ్చింది. ఇప్పటికీ ఫీజుల నియంత్రణపై సర్కారు నిర్ణయం తీసుకోలేదు.
ఇప్పటికే కొన్నిట్లో అడ్మిషన్లు పూర్తి!
2021–22 అకడమిక్ ఇయర్ అధికారికంగా ఈ నెల 23తో ముగుస్తుంది. జూన్ రెండోవారంలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ 2022–23 అకడమిక్ ఇయర్‌ను చాలా కార్పొరేట్, ఇంటర్నేషన్ స్కూళ్లు అనధికారికంగా ఎప్పుడో స్టార్ట్ చేశాయి. కొన్ని స్కూళ్లు అడ్మిషన్లు పూర్తిచేసి ఫస్ట్ టర్మ్ ఫీజునూ వసూలు చేశాయి.
దమ్ముంటే చట్టం చేయాలి
కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల కట్టడికి సర్కారు కోర్టుకు ఒకటి చెప్తూ, మరొకటి అమలు చేస్తున్నది. సర్కారు తీరుపై మేం హైకోర్టుకు పోయినం. హైకోర్టును పక్కదారి పట్టించేందుకు గ్రూపన్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని వేశారు. కానీ ఇప్పటికీ ఫీజుల కట్టడికి చట్టం చేయలేదు. సర్కారుకు దమ్ముంటే చట్టం చేయాలె. - వెంకట్, హెచ్ఎస్పీఏ లీడర్
ఫీజుల కట్టడిలో సర్కార్ ఫెయిల్
కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఫెయిలైంది. చట్టం తీసుకొస్తున్నామని చెప్పినా, అది కార్యరూపం దాల్చలేదు. గతంలోనూ ఓయూ మాజీ వీసీతో కమిటీ వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇప్పుడూ మినిస్టర్స్ కమిటీ వేసి అదే పనిచేస్తున్నది. ఫీజుల కట్టడి కోసం త్వరలోనే పోరాటం చేస్తం. -పి.శ్రీహరి, ఏబీవీపీ సీడబ్ల్యూసీ మెంబర్
దోపిడీ జరుగుతున్న పట్టదా?
విద్యా వ్యాపారాన్ని అరికడతామని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మరిచిపోయిన్రు. ఎనిమిదేండ్ల నుంచి కనీసం ఫీజుల కట్టడికి చట్టం తీసుకురాలేకపోయిన్రు. ప్రైవేటు మేనేజ్మెంట్ల ఒత్తిడితోనే వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. లక్షల మంది పేరెంట్స్ ను పక్కనపెట్టి.. కేవలం 10 వేల మంది మేనేజ్మెంట్లను పట్టించుకోవడం దారుణం. వెంటనే ఆర్డినెన్స్ తెచ్చి ఫీజులను కంట్రోల్ చేయాలి. -నాగటి నారాయణ, టీపీఏ స్టేట్ ప్రెసిడెంట్
ఇవి కూడా చదవండి
లఖింపూర్ ఖేరీ కేసులో అశిష్ మిశ్రా బెయిల్ రద్దు