మంత్రి అనుచరుడి కామెంట్పై లోకల్ లీడర్ల సీరియస్..సర్దిచెప్పిన మంత్రి

మంత్రి అనుచరుడి కామెంట్పై లోకల్ లీడర్ల సీరియస్..సర్దిచెప్పిన మంత్రి
  • కమ్యూనిటీ బిల్డింగ్​కు ఫండ్స్​ అడిగిన గౌడ్స్​తో మంత్రి మల్లారెడ్డి

యాదాద్రి, వెలుగు: ఎన్నికల ప్రచారానికి వచ్చిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి, ఆరెగూడెం వాసులకు మధ్య ఆదివారం వాగ్వాదం జరిగింది. టీఆర్ఎస్​ పార్టీలో చేరి ప్రచారం చేస్తేనే కమ్యూనిటీ హాల్​ బిల్డింగ్​కు డబ్బులిస్తానని చెప్పడంతో గొడవ మొదలైంది. మంత్రి వెంట వచ్చిన అనుచరుడు ఒకరు ‘పైసలు కావాలంటే చేరండి లేకపోతే పొండి’ అనడంతో లోకల్ ​లీడర్లు సీరియస్ అయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో. మంత్రి జోక్యం చేసుకొని ఇచ్చిన హామీని బుధవారం అమలు చేస్తానని చెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. 

380 ఓట్లున్నయ్​..అందరూ పార్టీలో చేరండి 

ప్రచారంలో తాను ఇన్​చార్జిగా ఉన్న ఆరెగూడెం గ్రామానికి ఆదివారం మంత్రి మల్లారెడ్డి వచ్చారు. వచ్చీరాగానే మరుగుజ్జులతో డ్యాన్సులు చేయించారు. పిల్లలతో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా వర్షం రావడంతో ‘అందరం మునిగిపోతాం.. వాన దేవుడా వర్షాన్ని ఆపు’ అని కోరుకున్నారు. తర్వాత గౌడ కులానికి చెందిన లీడర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గౌడ కులస్థులు..కమ్యూనిటీ బిల్డింగ్ ​నిర్మాణం కోసం మంత్రి ఇచ్చిన హామీని గుర్తు చేశారు. దీంతో 'మీ కులానికి 380 ఓట్లున్నాయి. మీ కులపోళ్లందరూ టీఆర్ఎస్​లో చేరాలె. పార్టీ గెలుపు కోసం ప్రచారం చేయాలె. అట్లయితనే కమ్యూనిటీ బిల్డింగ్​కు ఫండ్స్ ​ఇస్తా’ అని మంత్రి సమాధానమిచ్చారు.

దీంతో టీఆర్ఎస్​కు చెందిన కుల లీడర్లు లేచి 'కులానికో నీతా? మొన్న వేరే కులపోళ్లకు ఏ రూల్స్ పెట్టకుండా రూ. 12 లక్షలు ఇస్తమన్నరు. రెండు లక్షలు ఇచ్చిన్రు. మా కులానికి ఇస్తనని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్​లో చేరాలంటరా..? ఇదేం నీతి' అని నిలదీశారు. దీంతో అక్కడే ఉన్న మంత్రి అనుచరుడు 'మీకు పైసలు కావాలంటే..అందరూ చేరండి.

లేదంటే మీరు కూడా పార్టీ నుంచి పొండి’ అని అన్నారు. దీంతో లోకల్​ లీడర్స్ ​లేచి ‘ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని అంటారా?’ అంటూ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటేట్టుగా కన్పించడంతో మంత్రి మల్లారెడ్డి జోక్యం చేసుకొని రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో స్థానిక లీడర్లు శాంతించారు. 

కంపెనీ ఓనర్​తో పనులు చేయిస్తా

చౌటుప్పల్​లోని దివీస్​ కంపెనీ ఓనర్​ను పిలిపించి డెవలప్​మెంట్​వర్క్స్​ చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆ కంపెనీ కారణంగా కాలుష్యం పెరిగిపోయిందని, ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్​రెడ్డి ఎలాంటి పనులు చేయించలేదని విమర్శించారు. 

గొర్ల పైసలు రిలీజ్ ​చేయిస్తా 

ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్ల, కుర్మలను కలిసిన మంత్రి మల్లారెడ్డి గొర్రెల పంపిణీపై మాట్లాడారు. తాను ఇన్​చార్జిగా ఉన్న రెడ్డిబావి, ఆరెగూడెం, కాట్రేవు గ్రామాలకు చెందిన వారి గొర్రెలకు సంబంధించిన పైసలను బ్యాంకుల నుంచి రెండు రోజుల్లో రిలీజ్​ చేయస్తానని హామీ ఇచ్చారు. కరెంట్​లైన్లు లేని చోట రెండు రోజుల్లో లైన్లు వేయిస్తానని హామీ ఇచ్చారు.

గెలిపిస్తే గురుకులాల్లో సీటు

అదే విధంగా ఆయన కాలేజీకి సంబంధించిన స్టాఫ్​గ్రామంలోని స్టూడెంట్స్​డేటా సేకరించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్​అభ్యర్థి కూసుకుంట్లను గెలిపిస్తే గురుకులా ల్లో సీటు ఇప్పిస్తామని చెబుతూ స్టూడెంట్స్​తండ్రి పేరు, ఫోన్​నంబర్​తీసుకున్నారు.  పనిలో పనిగా తన కాలేజీ గురించి కూడా మంత్రి ప్రచారం చేసుకున్నారు. ఓ స్టూడెంట్​ను కలిసి ఆయన కాలేజీ బ్రోచర్​ఇచ్చి జాయిన్​ కావాలని కోరారు.