ఖండాంతర ఖ్యాతి గడించిన చేర్యాల పెయింటింగ్స్ .. కళకు ప్రాణం పోస్తున్న మూడు కుటుంబాలు

ఖండాంతర ఖ్యాతి గడించిన  చేర్యాల పెయింటింగ్స్ .. కళకు ప్రాణం పోస్తున్న మూడు కుటుంబాలు
  • స్థానికంగా యువత, విద్యార్థులకు శిక్షణ
  • నిరుపయోగంగా టూరిజం వర్క్ షాప్  గెస్ట్ హౌజ్

సిద్దిపేట/చేర్యాల, వెలుగు: ఖండాంతర ఖ్యాతి గడించిన చేర్యాల పెయింటింగ్స్ (నకాశీ)కు స్థానికంగా మూడు కుటుంబాలు ప్రాణం పోస్తున్నాయి. చేర్యాలలో నివాసముంటున్న నాగేళ్ల గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేర్గొజు మధు, పసుల మల్లేశం కుటుంబాలు చేర్యాలలో నివాసముంటూ  ప్రాచీన చిత్ర కళపై ఆధారపడి బతుకుతున్నాయి. మరో నాలుగు కుటుంబాలు హైదరాబాద్ లో నివాసముంటూ చేర్యాల పెయింటింగ్స్ భవిష్యత్ కోసం కృషి చేస్తున్నాయి. చేర్యాలలో నివాసముంటున్న  మూడు కుటుంబాలు స్థానిక విద్యార్థులకు, యువతకు పెయింటింగ్స్ లో మెలకువలు నేర్పుతున్నారు. 16వ శతాబ్దంలో మొఘల్ నవాబులు రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన ఈ కళ  నేడు చేర్యాల పెయింటింగ్స్ (నకాశీ) గా  విశ్వవ్యాప్తం అయింది. 2008 లో జీఐ ట్యాగ్​ హోదాను పొందింది.  ప్రస్తుతం ఏడు కుంటుబాల్లోని 30 మంది కళాకారులు మాత్రమే చేర్యాల పెయింటింగ్స్  వేస్తున్నారు.

పెయింటింగ్స్​ మాత్రమే జీవనాధారం

ప్రస్తుతం చేర్యాలలోనే నివాసముంటున్న  మేర్గొజు మధు అరుణ, నాగిళ్ల గణేశ్ వనజ, పసుల మల్లేశం కుటుంబాలు ఈ పెయింటింగ్స్ మీదనే ఆధార పడి జీవిస్తున్నాయి. వీరంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేర్యాలలో ఈ కళను నేర్చుకుని ఇక్కడే నివాసం ఏర్పరచుకుని చేర్యాల పెయింటింగ్స్ కు ఊపిరులూదుతున్నారు. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, కలకత్తాతో పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించే ఎగ్జిబిషన్లలో  వీరు చిత్రించిన పెయింటింగ్స్ ను  ప్రదర్శనకు పెడుతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మేర్గొజు మధు హైదరాబాద్, చేర్యాల ప్రాంతాల్లో స్కూళ్లలో సమ్మర్ క్యాంపులు, డీ సీహెచ్ కింద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. మిగతా కుటుంబాలు కూడా ట్రైనింగ్ సెంటర్ల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ  నకాశీ చిత్ర కళ కనుమరుగు కాకుండా ప్రయత్నిస్తున్నాయి.  

నిరుపయోగంగా టూరిజం వర్క్ షాప్ గెస్ట్ హౌజ్

చేర్యాల పెయింటింగ్స్ ను భవిష్యత్ తరాలకు అందించడం కోసం చేర్యాలలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ గెస్ట్ హౌజ్ నిరుపయోగంగా మారాయి. 2018లో  చేర్యాల మార్కెట్ యార్డు ఆవరణలో గ్రామీణ పర్యాటక పథకంలో భాగంగా రూ.25 లక్షలతో  వర్క్ షాప్ గెస్ట్ హౌజ్ ను ప్రారంభించారు. నకాశీ చిత్ర కళలో మెలకువలతో పాటు దాని ఔన్నత్యం, చిత్రాల తయారీ, మార్కెటింగ్ అంశాలపై స్థానికులకు, ఔత్సాహికులకు స్టైఫండ్  ఇచ్చి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత నిర్వహణ విషయంలో అధికారులు చేతులెత్తేయడంతో కనీసం విద్యుత్ చార్జీలు సైతం చెల్లించని పరిస్థితి ఏర్పడింది. ఎవరూ పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. 

మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వాలి

నకాశీ కళలో ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయాలి. వారికి శిక్షణ ఇస్తే బాగుంటుంది. మహిళల్లో ఓపిక ఎక్కువ కాబట్టి ఈ కళను నేర్చుకోవానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చేర్యాల పెయింటింగ్స్ కు ఆదరణ పెరుగుతుంది. దీనిపై ఆధార పడి పనిచేస్తున్న కళాకారులను  ప్రభుత్వం ఆదుకుని సంక్షేమ పథకాలు అందేలా చూడాలి. 

నాగిళ్ల గణేశ్, కళాకారుడు, చేర్యాల

ప్రభుత్వం  నిధులు కేటాయించాలి

చేర్యాల పెయింటింగ్స్ ను విశ్వవ్యాప్తం చేస్తున్న కళా కారుల సంక్షేమం కోసం ప్రభుత్వం  ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. కళ అంతరించిపోకుండా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కేవలం ట్రైనింగ్ సమయంలోనే కాకుండా పూర్తి స్థాయిలో జీతాలిచ్చి ప్రభుత్వం ఆదుకుంటే  నకాశీ కళ బతుకుతుంది. చేర్యాలలో  టూరిజం భవన్ లోని వర్క్ షాప్ ను మళ్లీ వినియోగంలోకి తెచ్చి  ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి. దీని వల్ల భవిష్యత్ తరాలకు కళను అందించినవారమవుతాం. 

  మేర్గొజు మధు, కళాకారుడు, చేర్యాల