కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మంచి ఫలితాలనే ఇస్తోంది. కేసుల సంఖ్య కంట్రోల్ కు బాగా ఉపయోగపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. లాక్ డౌన్ కు ముందు కరోనా కేసులు మూడున్న రోజుల్లోనే రెట్టింపు అయితే ప్రస్తుతం కేసులు డబుల్ కావడానికి ఏడున్నర రోజులు పడుతోందని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్. లాక్ డౌన్ కు ముందు పాజిటివ్ కేసుల సంఖ్య 3.4 రోజుల్లోనే రెట్టింపు అయ్యాయన్నారు. ఏప్రిల్ 19 నాటికి దేశ వ్యాప్తంగా ఈ గ్రోత్ రేట్ 7.5 రోజులకు చేరినట్లు తెలిపారు. రోజువారీ ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు అయ్యే విషయంలో దేశ సగటుతో పోలిస్తే 18 రాష్ట్రాలు మరింత బాగా కంట్రోల్ చేస్తున్నాయని చెప్పారు. ఏపీలో 10.6, తెలంగాణలో 9.4 రోజుల్లో కరోనా కేసుల రెట్టింపు అవుతున్నాయని తెలిపారు.
14 రోజులుగా 59 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్
గోవా కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారిందని, ఆ రాష్ట్రంలో ఏడు కేసులు నమోదు కాగా.. అందరూ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు లవ్ అగర్వాల్. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 59 జిల్లాల్లో గడిచిన 14 రోజులుగా కొత్త కరోనా కేసులు నమోదు కాలేదని చెప్పారు. పుదుచ్చేరిలోని మహే, కర్ణాటకలోని కొడగు, ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్వాల్ జిల్లాల్లో 28 రోజులుగా కరోనా కేసులు రాలేదన్నారు.
రాష్ట్రాల వారీగా కరోనా కేసుల రెట్టింపుకు టైమ్..
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం రోజులు
ఢిల్లీ 8.5
కర్ణాటక 9.2
తెలంగాణ 9.4
ఆంధ్రప్రదేశ్ 10.6
జమ్ము కశ్మీర్ 11.5
పంజాబ్ 13.1
ఛత్తీస్ గఢ్ 13.3
తమిళనాడు 14
బీహార్ 16.4
అండమాన్ నికోబార్ 20.1
హర్యానా 21
హిమాచల్ ప్రదేశ్ 24.5
చండీగఢ్ 25.4
అస్సాం 25.8
ఉత్తరాఖండ్ 26.6
లడఖ్ 26.6
ఒడిశా 39.8
కేరళ 72.2
