ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు

ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు
  • పేరు, జన్మ నక్షత్రాన్ని బట్టి మంచి తేదీ చూసుకుంటున్న అభ్యర్థులు 
  • లోక్ సభ ఎన్నికల నామినేషన్లకు రేపటి నుంచి25 వరకు గడువు 
  • 18, 19, 23, 24 తేదీల్లో ముహూర్తాలు బాగున్నయంటున్న పండితులు
  • ఈ నాలుగు రోజుల్లో ఎక్కువ నామినేషన్లు వచ్చే చాన్స్

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం మరో 24 గంటల్లో మొదలుకానుంది. దీంతో లోక్ సభ బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. మంచి రోజు, శకునం చూసుకుని నామినేషన్ వేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల18న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు 25వ తేదీ వరకు గడువు ఉంటుందని ఈసీ ఇదివరకే షెడ్యూల్ లో ప్రకటించింది. దీంతో మధ్యలో 21వ తేదీన ఆదివారం హాలీడే పోను నామినేషన్లు వేసేందుకు ఏడు రోజుల టైం మాత్రమే ఉంది. ఈ ఏడు రోజుల్లో తమకు కలిసొచ్చే రోజు కోసం అభ్యర్థులు పండితుల సలహాలు తీసుకుంటున్నారు.   
నాలుగు రోజులు మంచి ముహూర్తాలు

లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్ ముహూర్తం కోసం పండితులను సంప్రదిస్తున్నారు. తమ పేరు, జన్మ నక్షత్రాన్ని బట్టి ముహూర్తం ఎప్పుడు బాగుందో అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నెల18,19, 21, 22 తేదీల్లో పెండ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ నామినేషన్ల విషయానికొస్తే మాత్రం ఈ నెల 18, 19, 21, 23, 24 తేదీల్లో ముహూర్తం బాగుందని పండితులు చెప్తున్నారు. అభ్యర్థుల పేరు, పుట్టిన నక్షత్రాన్ని బట్టి ముహూర్తం నిర్ణయించుకోవాలని అంటున్నారు. 21న మంచి ముహూర్తమే ఉన్నప్పటికీ ఆ రోజు ఆదివారం కావడంతో నామినేషన్లకు అవకాశం లేదు. దీంతో ఆ రోజు మినహాయిస్తే మిగతా నాలుగు రోజుల్లో నామినేషన్లు ఎక్కువగా దాఖలయ్యే చాన్స్ ఉంది. 

19న గడ్డం వంశీకృష్ణ ఫస్ట్ నామినేషన్ సెట్ 

ఉన్న ముహూర్తాల్లో 19వ తేదీయే చాలా బాగుందని పండితులు చెప్తుండడంతో రాష్ట్రంలో చాలా మంది అభ్యర్థులు తమ ఫస్ట్ నామినేషన్ సెట్ ను ఆ రోజు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత మరో రోజు ర్యాలీ నిర్వహించి మరో సెట్ నామినేషన్ వేయాలని భావిస్తున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కూడా ఈ నెల19న ఫస్ట్ సెట్ నామినేషన్ వేయనున్నారు. అలాగే 23 లేదా 24వ తేదీన ర్యాలీగా వెళ్లి మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా ఈ నెల19న ఒక సెట్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. చివరి రోజు 25న ర్యాలీగా వెళ్లి మరో సెట్ నామినేషన్ వేయనున్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సైతం ఈ నెల19న లేదా 20న నామినేషన్ వేయనున్నట్లు తెలిసింది.