ఎన్నికల బరిలో ఆటో వాలా..!

ఎన్నికల బరిలో ఆటో వాలా..!

జోధ్‌పూర్‌ : ఎన్నికల్లో పోటీ చేయాలంటే అవతలి వ్యక్తికి ధీటుగా ఉండేలా చూస్తారు. డబ్బు పరంగా..లేదంటే పలుకుబడి ఉన్న వ్యక్తులు పోటీకి దిగుతుంటారు. అయితే ఇవి రెండు లేని ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఏకంగా సీఎం కొడుకుకు పోటీగా దిగుతున్నాడు. అతడి పొలిటికల్ స్టైల్ చూస్తుంటే బాషా సినిమాలో రజినీకాంత్ లాగే ఉందంటున్నారు స్థానికులు.

రాజస్థాన్‌ లోని జోధ్‌పూర్‌ కు చెందిన అనిల్ జోయా మేఘాల్ ఆటో నడుపుతూ.. భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఎన్నికల్లో పోటీచేయాలనే ఉద్దేశంతో..జోధ్ పూర్ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ వేశాడు. ఇదే నియోజకవర్గం నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కొడుకు వైభవ్ గెహ్లాట్‌.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా బరిలో ఉన్నారు. ఈ ఆటో డ్రైవర్‌ కు చరాస్తులు రూ.1.37లక్షలు.. రూ.15లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. రోజుకు రూ.400 నుంచి 500 వరకు సంపాదిస్తున్నట్లు అఫిడవిట్‌ లో తెలిపాడు. ప్రస్తుతం ఈ న్యూస్ స్థానికంగా వైరల్ అయ్యింది. కాలం కలిసి వస్తే , ఓటర్ల మనసులు మారితే తాను గెలిచే అవకాశం లేకపోలేదని ఆశాభావం వ్యక్తం చేశాడు ఈ బాషా.

తాను వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తినని.. తన వర్గానికి చెందినవారి అభ్యున్నతి కోసం కృషి చేయాలనుకుంటున్నాను అన్నాడు మేఘాల్. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్లు సమర్పిస్తే తిరస్కరించారని.. మళ్లీ గెలవాలనే ఆశతో పోటీ చేస్తున్నానంటున్నాడు. ఆటో డ్రైవర్ల యూనియన్ తనకు మద్దతుగా నిలిచిందని.. ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తోందన్నాడు. మరి చూడాలి బాషా సినిమాలో రజినీలాగే రియల్ లైఫ్ లో ఈ ఆటో డ్రైవర్ కృషి ఫలిస్తుందో లేదో. ఆల్ ద బెస్ట్ మేఘల్ అని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు ఓటర్లు.