ఫస్ట్ ఫేజ్ పోలింగ్ షురూ..

ఫస్ట్ ఫేజ్ పోలింగ్ షురూ..
  • అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా పోలింగ్  
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్ కు సమయం 

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా తొలి విడత పోలింగ్  కొనసాగుతోంది.   ఈ సారి 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండగా.. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఏప్రిల్ 19న ఉదయం 7 గంటలకు  ప్రారంభం అయ్యింది. ఏఐడీఎంకే నేత పళని స్వామి, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆర్ఎస్ఎస్ చీఫ్ మెహన్ భగవంత్  తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

 తొలి విడతలో 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ సీట్లకు పోలింగ్  జరుగుతోంది.  అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతోంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

అరుణాచల్ ప్రదేశ్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, సిక్కింలో 32 ఉన్నాయి. కాగా, మొత్తం 543 లోక్ సభ స్థానాలకు జూన్ 4న ఓట్ల కౌంటింగ్ జరగనుంది. మొదటి విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) తెలిపింది. 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 18 లక్షల మంది సిబ్బందిని నియమించామని వెల్లడించింది.   

యంగ్ ఓటర్స్ 3.51 కోట్లు.. 

మొదటి విడతలో మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఈసీ తెలిపింది. వీరిలో 8.4 కోట్ల మంది మగవాళ్లు, 8.23 కోట్ల మంది మహిళలు, 11,371 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని పేర్కొంది. 20–29 ఏండ్ల వయసున్న యంగ్ ఓటర్లు 3.51 కోట్ల మంది ఉండగా, కొత్త ఓటర్లు 35.67 లక్షల మంది ఉన్నారని వివరించింది. పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలను తరలించేందుకు 41 హెలికాప్టర్లు, 84 స్పెషల్ ట్రైన్స్, లక్ష వెహికల్స్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ‘‘50 శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తాం. అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమిస్తాం. కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ అబ్జర్వర్లను నియమించాం. ఇప్పటికే 127 మంది జనరల్, 67 మంది పోలీస్, 167 మంది ఎక్స్ పెండిచర్ అబ్జర్వర్లు తమ నియోజకవర్గాల్లో కొన్ని రోజులుగా విధులు నిర్వర్తిస్తున్నారు” అని ఎన్నికల సంఘం పేర్కొంది. 

బస్తర్ లో 60 వేల మందితో బందోబస్తు..  

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చత్తీస్ గఢ్ లోని బస్తర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మొదటి విడతలోనే ఎన్నిక జరగనుంది. ఇటీవల ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంఇక్కడ 60 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 14.72 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.  

పోటీలో కేంద్రమంత్రులు.. 

ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో మొత్తం 1,600 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 9 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలు, మాజీ గవర్నర్ ఒకరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేంద్ర మంత్రుల్లో నితిన్ గడ్కరీ (నాగ్ పూర్), కిరణ్ రిజిజు (అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనీర్–రాజస్థాన్), శర్బానంద సోనోవాల్ (దిబ్రూగఢ్ – అస్సాం), సంజీవ్ బలియాన్ (ముజఫర్ నగర్ – యూపీ), జితేంద్ర సింగ్ (ఉధంపూర్ – జమ్మూకాశ్మీర్), భూపేంద్ర యాదవ్ (అల్వార్ – రాజస్థాన్), ఎల్.మురుగన్ (నీలగిరి– తమిళనాడు), నిషిత్ ప్రమాణిక్ (కూచ్ బెహర్ – బెంగాల్) ఉన్నారు. ఇక మాజీ గవర్నర్ తమిళిసై తమిళనాడులోని చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తుండగా.. మాజీ ముఖ్యమంత్రులు బిప్లబ్ కుమార్ దేబ్ త్రిపుర వెస్ట్ నుంచి, నబమ్ తుకీ అరుణాచల్ వెస్ట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 

తొలి విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాలు ఇవే..  

లోక్ సభ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడులో 39 సీట్లు, ఉత్తరాఖండ్ లో 5 సీట్లు ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ లో 2 సీట్ల చొప్పున ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్ లో ఒక్కో సీటు చొప్పున ఉన్నాయి. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ఫేజ్ లోనే ఎన్నికలు ముగియనున్నాయి. 

ఇక కొన్ని పెద్ద రాష్ట్రాల్లోని కొన్ని స్థానాలకు ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రాజస్థాన్ లో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, అస్సాంలో 5, మహారాష్ట్రలో 5, బిహార్ లో 4, పశ్చిమ బెంగాల్ లో 3 సీట్లు ఉండగా.. త్రిపుర, జమ్మూకాశ్మీర్, చత్తీస్ గఢ్ లో ఒక్కో సీటు చొప్పున ఉన్నాయి. కాగా, ఈ 102 ఎంపీ సీట్లలో 2019లో ఎన్డీఏ 41 గెలుచుకోగా, యూపీఏ 45 సీట్లను గెలుచుకుంది.

అందరూ ఓటెయ్యండి: సీఈసీ 

లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన వీడియో మెసేజ్ విడుదల చేశారు. ‘‘మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఎంతో గొప్పవి. మిమ్మల్ని పాలించే ప్రభుత్వాన్ని మీరే ఎంచుకునే అవకాశం ఉంది. మీ ఓటును మీరెప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. ఒక్క ఓటుతో రిజల్టే మారిపోతుంది. అందుకే ప్రతి ఓటు కూడా ముఖ్యమైనదే” అని ఆయన మెసేజ్ లో పేర్కొన్నారు.