వైభవంగా హేమాచల లక్ష్మీ నృసింహుడి కల్యాణం

వైభవంగా హేమాచల లక్ష్మీ నృసింహుడి కల్యాణం

 

  • పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క
  • భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ ఈవో శనిగల మహేశ్‌‌‌‌ పర్యవేక్షణలో, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందంతో పాటు హేమాచల ఆలయ ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం వైభవంగా జరిగింది. శిశు  సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారితో పాటు, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ముస్తాబు చేసి మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్‌‌‌‌ లగ్నంలో కల్యాణమహోత్సవం జరిపించారు. 

అనంతరం అన్నదానం చేశారు. స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా ట్రాఫిక్‌‌‌‌ ఇబ్బందులు తలెత్తకుండా ఏటూరునాగారం ఏఎస్పీ మహేశ్‌‌‌‌, సీఐ రాజు, మంగపేట ఎస్సై గోదారి  రవికుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవన కుమారాచార్యులు, యేడునూతల ఈశ్వరచందు శర్మ, ముక్కామల వేంకటనారాయణశర్మ, అనిపెద్ది మురళీమోహనాచార్యులు, బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు బలరాం పాల్గొన్నారు.