తక్కువ ఖర్చుతో కలుపు మెషిన్

తక్కువ ఖర్చుతో కలుపు మెషిన్

వరి నాట్లు, చేనులో కలుపు తీయడం... పని ఏదైనా టైంకి కూలీలు దొరక్క ఇబ్బంది పడుతుంటారు రైతులు. తక్కువ ఖర్చుతో, టైంకి సాగు పనులు పూర్తి చేసే మెషిన్ ఉంటే బాగుండు అనుకుంటారు. అలాంటిదే ఈ కలుపు తీసే మెషిన్. కూలీలు దొరక్క తండ్రి పడుతున్న బాధ చూసి ఈ మిషిన్​ తయారు చేశాడు ఇతను. అది కూడా పాత బైక్​ ఇంజన్, పాత ఆటోల విడిభాగాల​తో. అలాగని ఇతనేమీ ఇంజనీరింగ్ చదవలేదు. ఏడో క్లాస్​ వరకే చదివి  బైక్​ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. ఇతనిది కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ మండలంలోని  వంజిరి గ్రామం. పేరు సయ్యద్ సమీర్. 

సమీర్​ తండ్రి హసన్​. ఆయనకు సొంత పొలం లేదు. దాంతో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. చేనులో కలుపు పెరగడంతో కూలీల కోసం తిరిగాడు. కానీ, వ్యవసాయ పనుల సీజన్​ కావడంతో కూలీలు దొరకలేదు. పైగా కూలీ రేట్లు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మందిని పిలవలేని పరిస్థితి. ‘టైంకి కలుపు తీయకుంటే పంట దెబ్బతింటుంది. పెట్టుబడి పైసలు కూడా రావ’ని బాధపడుతున్న తండ్రిని చూసి కలుపు తీసే మెషిన్ తయారు చేయాలనుకున్నాడు సమీర్​. పాత టీవీ ఎస్ బైక్  ఇంజన్ (టీవీఎస్ మ్యాక్స్ 100 ఆర్) ను రూ. 1500లకు కొన్నాడు.  రెండు ఆటో రిక్షా వీల్ డెస్క్​లు, రెండు ఇనుప చక్రాలు, షాఫ్ట్, పలుగు వంటివి తీసుకున్నాడు.... వాటిని వెల్డింగ్ చేశాడు. అలా 45 రోజులు కష్టపడి  కలుపు తీసే యంత్రం తయారుచేశాడు​. ఈ మెషిన్​ తయారీకి సమీర్​ ఖర్చు చేసింది... 15 వేల రూపాయలు. 

లీటర్ పెట్రోల్​తో...  

మెషిన్​తో ఒక్కరోజులోనే  వాళ్ల పత్తి చేనులో కలుపు తీశాడు సమీర్. దాంతో చుట్టుపక్కల రైతులు కూడా పొలాల్లో కలుపు తీసేందుకు అతడిని పిలుస్తున్నారు. రోజుకు రెండు లేదా మూడు  ఎకరాల్లో కలుపు తీసేందుకు వెళ్తున్నాడు ఇప్పుడు​. ఎకరానికి పదిహేను వందల రూపాయలు తీసుకుంటున్నాడు.  పత్తి, మిరప చేనులో కలుపు తీయడానికి, డౌరా కొట్టడానికి ఈ యంత్రం పనికొస్తుంది. లీటరు పెట్రోల్​తో ఎకరం చేనులో కలుపు తీయొచ్చు. కలుపు తీశాక ఈ మెషిన్​కి మరో చక్రం అమర్చి ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ కలుపు అయ్యేసరికి చీకటి పడినా,  రాత్రిపూట కలుపు తీయాల్సి వచ్చినా ఇబ్బంది లేకుండా మెషిన్​కి లైట్లు కూడా పెట్టాడు​.     

:: డి. మహేశ్వర్​ప్రసాద్​, 
కాగజ్​నగర్, వెలుగు