ఎల్ఆర్ఎస్ జీవోలు బీఆర్ఎస్ ​ప్రభుత్వంలో ఇచ్చినవే : కోదండరెడ్డి

ఎల్ఆర్ఎస్ జీవోలు బీఆర్ఎస్ ​ప్రభుత్వంలో ఇచ్చినవే : కోదండరెడ్డి
  •  అనధికార లేఅవుట్లు అన్నీ కబ్జా చేసినవే 
  • ఆ పార్టీ నేతలు అప్పుడు దోచుకొని ఇప్పుడు ఫ్రీగా చేయమంటున్నరని విమర్శ

హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్ పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలే ఇపుడు ఉన్నాయని, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఉన్నపుడు ఇచ్చిన జీవోల్లోనే రేట్లు ఖరారు చేశారని కిసాన్ కాంగ్రెస్ సెల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనధికార లేఅవుట్లు అన్ని.. చెరువులు.. అసైన్డ్ భూములు.. ప్రభుత్వ భూములు అక్రమించి చేసినవే అని, అక్రమ లేఅవుట్లు వేస్తుంటే మీరు నిద్ర పోయారా లేక మీ నాయకులకు దోచుకోండి అని అనుమతి ఇచ్చారా అని ప్రశ్నించారు.

 అమాయక ప్రజల డబ్బులు దోచుకొని ఇప్పుడేమో ఉచితంగా రెగ్యులర్ చేయండి అని నీతి వాక్యాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు హోసింగ్ బోర్డ్ ద్వారా ఇండ్లు ఇచ్చింది మా ప్రభుత్వం అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కొని బిల్డర్లకు అప్పగించిందని, చాలా చోట్ల శిఖం భూములు కబ్జా చేసి ఇపుడు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్ఎండీఏ లేఅవుట్లపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్ని ఎత్తులు వేసి, ఎన్ని మాయా మాటలు చెప్పినా తెలంగాణ ప్రజలు ఇప్పుడు వారిని నమ్మే పరిస్థితి లేదన్నారు.