చైనాలో లూనార్​ న్యూఇయర్ జర్నీలు షురూ..

చైనాలో లూనార్​ న్యూఇయర్ జర్నీలు షురూ..

కరోనాను లెక్కచేయని జనం.. సొంతూళ్లకు వెళ్లేందుకు కోట్లమంది క్యూ

షాంఘై : చైనాలో లూనార్​ న్యూఇయర్​ సందడి మొదలైంది. ఓవైపు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా.. కొత్త ఏడాది సంబరాలను ఈసారి మిస్​ కావొద్దని చైనీయులు భావిస్తున్నారు. వైరస్ భయంతోనే సొంతూరికి బయలుదేరుతున్నారు. ఈ నెల 21 నుంచి కొత్త ఏడాది మొదలు కానుండడంతో రైల్వే స్టేషన్లు, ఎయిర్​ పోర్టుల్లో బారులుతీరారు. సొంతవాహనాలలో వెళ్లే వారు కూడా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను సొంతూళ్లో జరుపుకోవడం చైనీయుల సంప్రదాయం. నలభై రోజుల పాటు జరిగే ఈ పండుగకు భారీ సంఖ్యలో జనం ప్రయాణాలు చేస్తుంటారు. దీనికి ‘గ్రేట్​ మైగ్రేషన్’ అని కూడా వ్యవహరిస్తారు. కరోనా కారణంగా మూడేళ్లుగా పండుగను సంప్రదాయం ప్రకారం జరుపుకోవడం చైనీయులకు వీలుకాలేదు. ప్రభుత్వం ఇటీవలే ఆంక్షలను సడలించింది.

40 రోజుల వేడుక..

ప్రయాణం మొదటి రోజును చున్​యున్​ అని పిలుస్తారు. ఇది శనివారం మొదలైంది. 40 రోజుల పాటు ఈ లూనార్​ న్యూఇయర్​ వేడుక కొనసాగుతుంది. 2020 తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రయాణాలకు అనుమతించడం ఇదే తొలిసారి. 

200 కోట్ల ప్రయాణాలు..

ఈ ఏడాది సుమారు 200 కోట్ల(రాకపోకలు కలిపి) ప్రయాణాలు జరుగుతాయని రవాణా శాఖ అధికారుల అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఇది 99.5 శాతం పెరిగింది. కరోనా ముందు అంటే 2019తో పోలిస్తే 70.3% పెరిగింది. సొంత ఊర్లకు వెళ్లి కొత్త ఏడాది సంబురాలు జరుపుకునేందుకు దాదాపు మూడేండ్ల తర్వాత అవకాశం దక్కడంతో చాలా మంది ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు.  కరోనా భయాలు వెంటాడుతున్నా ఎక్కువ శాతం 
మంది వెనక్కి తగ్గడం లేదు.

కరోనా​ పాలసీ విమర్శకులపై ​కొరడా

1,120 సోషల్​ మీడియా అకౌంట్ల తొలగింపు 

చైనా మరోసారి తన సిటిజన్ల భావ ప్రకటన స్వేచ్ఛను హరించింది. ప్రభుత్వ కరోనా పాలసీలపై విమర్శలు చేస్తున్న వారిపై నిరంకుశంగా వ్యవహరించింది. విమర్శకులకు చెందిన దాదాపు 1,120 సోషల్​ మీడియా అకౌంట్లను ఆయా ప్లాట్​ ఫామ్​ల నుంచి తొలగించింది.  కరోనా పాలసీని విమర్శిస్తూ కొందరు స్కాలర్లు, మెడికల్​ ఎక్స్​ పర్ట్స్​ సోషల్​ మీడియా వేదికగా రాసే విశ్లేషణలపై చైనా సర్కారు నుంచి దాదాపు 12,854 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ప్రముఖ చైనీస్​ సోషల్​ మీడియా సంస్థ ‘సినా వీబో’ వెల్లడించింది. ఇంకొందరు విమర్శకుల సోషల్​ మీడియా అకౌంట్లపై సైబర్​ దాడులు కూడా జరిగాయని పేర్కొంది.  కఠిన లాక్​ డౌన్లు, క్వారెంటైన్​ నిబంధనలు సరైనవే అనే మెసేజ్​ జనంలోకి పంపేందుకు చైనా సర్కారు స్కాలర్లు, మెడికల్​ ఎక్స్ పర్ట్స్​పై ఆధారపడుతోంది. వీరిలో ఎవరైనా ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ మాట్లాడితే మాత్రం.. వేధింపులకు పాల్పడుతోంది.  గత 24 గంటల్లో చైనాలో 10వేల పైచిలుకు కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు వైరస్​ తో చనిపోయారు. ఈవిధంగా ఓ వైపు కేసులు పెరుగుతున్నా చైనా సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోందని నిపుణులు విమర్శిస్తున్నారు.  ఈ విమర్శలు మింగుడుపడకే తాజాగా వెయ్యికిపైగా నిపుణుల సోషల్​ మీడియా అకౌంట్లను చైనా ప్రభుత్వం మూసివేయించింది.