వచ్చే రెండేళ్లలో మరో బిలియన్- డాలర్ బ్రాండ్‌‌‌‌గా మాజా ..!

వచ్చే రెండేళ్లలో మరో బిలియన్- డాలర్ బ్రాండ్‌‌‌‌గా మాజా ..!

న్యూఢిల్లీ : తన పాపులర్​ జ్యూస్ బ్రాండ్ మాజా వచ్చే రెండేళ్లలో మరో బిలియన్- డాలర్ బ్రాండ్‌‌‌‌గా ఎదుగుతుందని  కోకా-కోలా భావిస్తోంది. రిలయన్స్​ వంటి బడా కంపెనీలు  కార్బొనేటేడ్ పానీయాల మార్కెట్లోకి  వస్తున్నప్పటికీ ఈ కంపెనీ ఆందోళన చెందడం లేదు. ష్వీప్స్ వంటి బ్రాండ్‌‌ల ద్వారా ప్రీమియం హైడ్రేషన్ వాటర్​  మార్కెట్లోనూ దూసుకెళ్తోంది. ఇన్​ఫ్లేషన్​ సమస్యను అధిగమించడానికి చిన్న-ప్యాక్ వ్యూహాన్ని అనురిస్తోంది. ఈసారి వర్షాలు బాగా పడటం, ఉద్యోగాల మార్కెట్‌‌ పుంజుకోవడం,  మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వ పెట్టుబడులు వంటివి తమకు అనుకూలంగా మారుతాయని  కోక్​  భావిస్తోంది. వీటివల్ల గ్రామీణ మార్కెట్ తిరిగి పుంజుకోగలదని కోకాకోలా ప్రెసిడెంట్ (భారతదేశం–  నైరుతి ఆసియా) సంకేత్ రే  చెప్పారు.  

తన లెమన్​ ఫ్లేవర్ డ్రింక్​ స్ర్పైట్ భారతీయ మార్కెట్లో బిలియన్ డాలర్ల బ్రాండ్‌‌గా మారిందని వెల్లడించారు.  మాజా కూడా రాబోయే రెండేళ్లలో బిలియన్ డాలర్ల లీగ్‌‌లో చేరుతుందన్నారు. వాతావరణం బాగాలేకపోవడం,  మామిడి ధరలు పెరగడం వంటి కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు.  మామిడి పండు గుజ్జు ధర పెరగకపోయి ఉంటే వచ్చే ఏడాదే బిలియన్​ డాలర్ల మాజా టార్గెట్​ను చేరుకొని ఉండేవాళ్లమని అన్నారు.  థమ్స్ అప్ బ్రాండ్​  2021లోనే బిలియన్ డాలర్ల బ్రాండ్‌‌గా మారింది. మాజా అనేది మామిడితో చేసే డ్రింక్. ఆల్ఫోన్సో రకానికి చెందిన మామిడి గుజ్జుతో తయారవుతుంది. మాజా వ్యాపారం గురించి రే మాట్లాడుతూ ఈ సంవత్సరం దాదాపు రూ. 4,500 కోట్ల నుండి రూ. 5,000 కోట్ల అమ్మకాలు సాధిస్తామని అన్నారు.