ఆన్‌‌లైన్‌‌లో పేపర్లు మాయం: వందేళ్ల కిందటి పుస్తకాలు కనిపిస్తలేవ్‌ 

V6 Velugu Posted on Aug 02, 2021

  • ఆన్‌‌లైన్‌‌లో పేపర్లు మాయం
  • వందేళ్ల కిందటి మ్యాగజైన్లు, పుస్తకాలు కనిపిస్తలేవ్‌ 
  • మీడియా అకాడమీ వెబ్‌‌సైట్స్‌‌లో కనిపించని లింక్స్‌‌
  • ఏపీకి తరలిపోయిన హార్డ్‌‌ డిస్క్‌‌లు

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో డిజిటలైజ్ చేసి పబ్లిక్ డొమైన్‌‌లోకి అందుబాటులోకి తెచ్చిన వందేళ్ల క్రితం నాటి న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, పుస్తకాలు ఇప్పుడు ఆన్‌‌లైన్‌‌లో కనిపించట్లేదు. పదేళ్ల క్రితం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రారంభించిన అరుదైన పుస్తక సంపద గల వెబ్‌‌సైట్‌‌ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఒకప్పటి ఏపీ ప్రెస్ అకాడమీ వెబ్ సైట్ స్థానంలో కొన్నాళ్ల క్రితం కొత్తగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ వెబ్ సైట్లను ప్రారంభించిన ప్రభుత్వాలు.. వాటిలో ఆర్కైవ్స్ లింక్‌‌ను పెట్టడం మరిచాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, మీడియా అకాడమీల పట్టింపులేకపోవడంతో రీసెర్చ్ స్కాలర్లు, రచయితలు ఇబ్బంది పడాల్సి వస్తోంది.
 

పొత్తూరి వెంకటేశ్వర్‌‌రావుతో స్టార్ట్‌‌

ఉమ్మడి ఏపీలోని పలు ప్రముఖ లైబ్రరీల్లో వందేళ్ల క్రితం నాటి న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, పుస్తకాలు ముట్టుకుంటే చినిగిపోయే స్థితిలో ఉండేవి. ఇంకొన్ని రోజులైతే అవి చేతికి కూడా రావని 20 ఏండ్ల కిందట అప్పటి ప్రెస్ అకాడమీ చైర్మన్‌‌ పొత్తూరి వెంకటేశ్వర్‌‌రావు.. వాటి డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన చైర్మన్లు ఆ ప్రాజెక్టును కొనసాగించారు. పదేళ్ల పాటు శ్రమించి హైదరాబాద్ అఫ్జల్ గంజ్‌‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, వేమన గ్రంథాలయం, సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఆంధ్ర సారస్వత పరిషత్‌‌ లైబ్రరీ, రాజమండ్రిలోని గౌతమి గ్రంథాలయం, వేటపాలెం గ్రంథాలయాల్లో ఉన్న 1900 – 1977 కాలం నాటి న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు, ప్రత్యేక సంచికలు, విలువైన పుస్తకాలను స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్‌‌గా మార్చారు. వీటిని ఏపీ ప్రెస్ అకాడమీ వెబ్ సైట్ ఆర్కైవ్స్‌‌లో పెట్టి 2011లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి గోలకొండ, ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక లాంటి న్యూస్‌ పేపర్లు.. భారతి, తెలుగు తల్లి లాంటి వందలాది మంత్లీ మ్యాగజైన్లు, సావనీర్స్ లాంటివి ఆర్కైవ్స్‌‌లో ఉన్నాయి.  
 

రెండు నెలలుగా పని చేయట్లే.. 
ఏపీ ప్రెస్ అకాడమీ ఆర్కైవ్స్ లింక్‌‌లో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు అనే రెండు కేటగిరీల్లో పత్రికలు, పుస్తకాలు కనిపించేవి. ఈ సైట్ 2 నెలల క్రితమే క్లోజ్ అయింది. ఆ తర్వాత ఏపీ మీడియా అకాడమీ పేరుతో వెబ్ సైట్‌‌ను ప్రారంభించినా అందులో ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప మరే సమాచారం లేదు. తెలంగాణ మీడియా అకాడమీ వెబ్ సైట్‌‌లో ఆర్కైవ్స్ లింక్ ఉన్నా ఓపెన్ చేస్తే  ‘తెలంగాణ ప్రెస్ అకాడమీ వద్ద 1900 సంవత్సరం నుంచి వెలువడిన న్యూస్ పేపర్లు,  మ్యాగజైన్లు ఉన్నాయి. అప్ డేట్స్ కోసం వెయిట్ చేయండి’  అని కనిపిస్తోంది. మరోవైపు ఇన్నాళ్లు హైదరాబాద్‌‌లోనే ఉన్న పాత పత్రికల హార్డ్‌‌డిస్క్‌‌లను ఇటీవల విజయవాడకు తరలించారని తెలిసింది.  

చెయ్యి విరిగినట్టుంది 
నేను ప్రెస్ అకాడమీ ఆర్కైవ్స్  వెబ్‌‌సైట్‌‌ను వందల సార్లు వాడుకున్నాను. ఇప్పుడు అది కనిపించట్లేదు. ఏదైనా వెతుకుదామంటే ఆర్కైవ్స్ దొరక్క చెయ్యి విరిగినట్టు అయింది. ఆ పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఉమ్మడి ఆస్తి. వాటిని పరిరక్షించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి.                                                                                                   - ఎన్. వేణుగోపాల్,  రచయిత,సీనియర్ జర్నలిస్టు

Tagged online, missing, magazines, books, , hundreds of years

Latest Videos

Subscribe Now

More News