మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎక్కడికక్కడ నిరోధించాలని, మద్యం, డబ్బు పంపిణీపై ఫోకస్ పెట్టాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్ వెబెక్స్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల వ్యయం ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు అనుక్షణం అలర్ట్ గా ఉండాలని చెప్పారు.
రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లను, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ఊరేగింపులకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. మోడల్ కోడ్ అమలుపై ప్రతిరోజు నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన నుంచి ఎన్నికల ఖర్చు నమోదు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లో సౌలత్లు చెక్ చేయాలని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, జడ్పీ సీఈవో వెంకటరెడ్డి, డీపీవో పార్థసారథి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
గడువులోపు అనుమతులు ఇవ్వండి..
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు గడువులోపు అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో పరిశ్రమల శాఖపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలకు టీజీ ఐపాస్ కింద వివిధశాఖల ద్వారా మంజూరు చేయాల్సిన అనుమతులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. టీ ప్రైడ్ పథకం కింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఏడుగురు, షెడ్యూల్ ట్రైబ్ చెందిన 14 మందికి వాహన పెట్టుబడి సబ్సిడీ ఇవ్వడానికి కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం యాదయ్య, ఎల్డీ ఎం.చంద్రశేఖర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.జనార్దన్, కాలుష్య నియంత్రణ మండలి సహాయ పర్యావరణ ఇంజినీర్ సాయిదివ్య, అధికారులు పాల్గొన్నారు.
