కేసీఆర్​కు మహాచెక్​!.. బీఆర్​ఎస్​ విస్తరణ ప్లాన్​ కు మహారాష్ట్ర సర్కార్​ ప్రతివ్యూహం

కేసీఆర్​కు మహాచెక్​!.. బీఆర్​ఎస్​ విస్తరణ ప్లాన్​ కు మహారాష్ట్ర సర్కార్​ ప్రతివ్యూహం
  • కాళేశ్వరం ముంపు బాధితులకు పరిహారం ఇవ్వకుండా జాప్యం
  • నాలుగేండ్లుగా అక్కడి నిర్వాసితుల అలుపెరగని పోరాటం
  • రూ.26 కోట్ల పరిహారం ఇచ్చి రైతులకు దగ్గరైన  మహారాష్ట్ర ప్రభుత్వం 

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి /మహదేవపూర్, వెలుగు:  
జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలని కలలు కంటున్న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇందుకు మహారాష్ట్రను వేదిక చేసుకున్నారు. ఇందులో భాగంగానే  అక్కడ  పార్టీ విస్తరణకు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.  ఇప్పటికే  రెండు, మూడు బహిరంగ సభలు కూడా పెట్టి, మహారాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.  కానీ  కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల  ముంపునకు గురవుతున్న  మహారాష్ట్ర రైతులను ఆదుకోవడం మాత్రం మరిచిపోయారు.  పరిహారం కోసం నాలుగేండ్లుగా అక్కడి నిర్వాసితులు పోరాడుతున్నా ఇప్పటికీ పైసా పరిహారం ఇవ్వలేదు. దీంతో  రైతులను ఆదుకునేందుకు మహారాష్ట్ర సర్కారు స్వయంగా ముందుకొచ్చింది. మేడిగడ్డ బ్యాక్​వాటర్​లో  నష్టపోతున్న రైతులకు ఏకంగా రూ.26 కోట్ల విలువైన నష్టపరిహారం చెక్కులను అందించడం ద్వారా వాళ్ల మనసులను గెలుచుకున్నది. అదే టైమ్​లో మహారాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్​ఇమేజ్​ను  కూడా దెబ్బతీసినట్లైందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 నాలుగేండ్లుగా మునుగుడే 

తెలంగాణ సర్కారు లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతి కీలకమైంది మేడిగడ్డ బ్యారేజీ.  భూపాలపల్లి జిల్లా మహదేవ‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలో గోదావరి నదిపై కట్టిన ఈ బ్యారేజీ వల్ల  మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాలో 128 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని తెలంగాణ ఇంజినీర్లు చేసిన సర్వేలో  తేలింది. ఇందుకు సంబంధించి  ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర రైతులకు నష్ట పరిహారం కింద రూ.37 కోట్లు తెలంగాణ సర్కారు చెల్లించాల్సి ఉండగా, బ్యారేజీ ప్రారంభానికి ముందే రూ.11 కోట్లు తెలంగాణ సర్కారు ఇచ్చింది.  ఇంకా రూ.26 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉండగా ఫండ్స్ లేవని నాలుగేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2019, జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. బ్యారేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్లు వేయడంతో మహారాష్ట్ర  వైపు వందలాది ఎకరాల భూములు బ్యాక్ వాటర్​లో మునిగిపోయాయి. దీంతో రైతులు వ్యవసాయం చేయలేకపోయారు. తమకు తెలంగాణ సర్కారు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని పోరాటం మొదలుపెట్టారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు సిరోంచ లో రిలే నిరాహార దీక్షలు చేశారు. మొదట 40 రోజుల పాటు , రెండోసారి 43 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  పలు మార్లు సిరోంచ తహసీల్దార్​ ఆఫీసులో జరిగిన చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ ఆఫీసర్లు పాల్గొని రైతులకు నష్ట పరిహారం ఇస్తామంటూ మభ్య పెట్టారు.  ఆర్నెళ్ల కింద జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే చేసి ముంపునకు గురవుతున్న వ్యవసాయ భూముల వివరాలు, రైతుల పేర్లు రాసుకొని వచ్చారు. కానీ ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వానికి పరిహారం డబ్బులు పంపించడంలో అలసత్వం ప్రదర్శించారు.

 పరిహారం చెక్కులు అందిస్తున్న మహారాష్ట్ర సర్కారు

ఓవైపు కాళేశ్వరం ముంపు  రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చడం,  మరోవైపు మహారాష్ట్రలో బీఆర్​ఎస్​ పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండడంతో అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగింది.  ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు సిరోంచ రైతులకు దగ్గరవుతూనే, ఇటు కేసీఆర్​కు  చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టేలా నష్ట పరిహారం చెక్కుల పంపిణీ ప్రారంభించింది. నిజానికి కాళేశ్వరం ముంపు బాధితులు రెండోసారి చేపట్టిన దీక్షలు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. అక్కడి అసెంబ్లీలో ప్రతిపక్షాలు కూడా దీనిని రేజ్​ చేశాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పట్లో  నష్టపరిహారం అందేలా లేదని  భావించిన మహారాష్ట్ర సర్కారు తమ రైతులకు ఇవ్వాల్సిన రూ.26 కోట్లను తామే చెల్లిస్తామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల కింద గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాలో ఎంపీ అశోక్, ఎంఎల్ సీ రాందాస్ అంబేద్కర్​ రైతులకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ ప్రారంభించారు. ‘మహా’ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ప్రజల మనుసులు గెలుచుకోవడంతో పాటు కేసీఆర్​ ఇమేజీని ఆ రాష్ట్రంలో పలచన చేసినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.