మహీంద్రా ఈవీ సేల్స్​ పెరిగాయ్​

మహీంద్రా ఈవీ సేల్స్​ పెరిగాయ్​

 కిందటేడాది 10,276 వాహనాల అమ్మకం

ఫేమ్‌‌–2తో డిమాండ్‌‌ పెరుగుతుందన్న కంపెనీ

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌‌ మహీంద్రా ఎలక్ట్రిక్‌‌ వెహికిల్స్ (ఈవీ) అమ్మకాల్లో దూసుకుపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 10,276 ఈవీలను అమ్మింది. ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌‌ లిమిటెడ్‌‌ (ఈఈఎల్‌‌ఎస్‌‌) వంటి సంస్థల నుంచి ఆర్డర్లు పెరగడమే ఇందుకు కారణం. ఈ–వెరిటో, వ్యాన్‌‌ ఈ–సుప్రిమో, కాంపాక్ట్‌‌ ఈ2ఓ, ట్రియో వంటి ఈవీలను మహీంద్రా అమ్ముతుంది. 2017–2018 ఆర్థిక సంవత్సరంలో 4,026 యూనిట్లను అమ్మినట్టు కంపెనీ ప్రకటించింది. ఈఈఎస్‌‌ఎల్‌‌ నుంచి రెండోదఫా ఆర్డర్లు కూడా రావడంతో ఈవీల అమ్మకాలు పెరిగాయి. ఇది మొదటిదశలో 500 ఎలక్ట్రికల్‌‌ కార్లు కొన్నది. వీటిలో 150 కార్లను మహీంద్రా, మిగతా వాటిని టాటా మోటార్స్‌‌ సరఫరా చేశాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేమ్‌‌ పథకం వల్ల ఈవీలకు మరింత గిరాకీ పెరుగుతుందని మహీంద్రా ఆశాభావం వ్యక్తం చేసింది.

ట్రియో, ఈ–సుప్రో వాహనాలకు ఫేమ్‌‌ ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపింది. ఫేమ్‌‌ రెండోదశలో ఈవీలకు రాయితీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనుంది. దేశవ్యాప్తంగా ఈ–రిక్షాలకు రూ.50 వేల చొప్పున రాయితీ ఇవ్వనుంది. దీని ఎక్స్‌‌–షోరూమ్‌‌ ధర రూ.ఐదు లక్షల వరకు ఉంటుంది. రూ.15 లక్షల ఎక్స్‌‌ షోరూం ధర ఉండే ఫోర్‌‌ వీలర్లకు రూ.35 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు రాయితీలు దక్కుతాయి. హైబ్రిడ్‌‌ ఫోర్‌‌ వీలర్లకు రూ.13 వేల నుంచి రూ.30 వేల వరకు డిస్కౌంట్లు ఇస్తారు. మహీంద్రా గత నవంబరులో ట్రియో, ట్రియో యారీ ఈవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆటో రిక్షా డ్రైవర్లకు చవకగా అప్పులు ఇవ్వడానికి త్రీ వీల్స్‌‌ యునైటెడ్‌‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని మహీంద్రా తెలిపింది. ఈ ఏడాది దీనికి వెయ్యి ట్రియోలను సరఫరా చేస్తామని వెల్లడించింది. కరెంటు వాహనాలను భారీగా ఉత్పత్తి చేయడానికి మహీంద్రా గత నవంబరులో బెంగళూరులో ఎలక్ట్రిక్ టెక్నాలజీ మానుఫ్యాక్చరింగ్‌‌ హబ్‌‌ ఏర్పాటు చేసింది. ఇందుకు రూ.100 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా కంపెనీ ఏటా 25 వేల యూనిట్ల ఈవీలను తయారు చేయగలుగుతుంది.