- నాలుగున్నర ఎకరాల్లో మక్కజొన్న కాలిబూడిద
- కరెంట్ వైర్ల నుంచి నిప్పు రవ్వలు పడి ప్రమాదం
- రైతుకు రూ.3లక్షల నష్టం
శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారంలో 11కేవీ కరెంట్ వైర్లు ఒకదానికొకటి తాకి నిప్పురవ్వలు చెలరేగి నాలుగున్నర ఎకరాల్లో మక్కజొన్న పంట కాలిపోయింది. శాయంపేటకు చెందిన నీల సురేందర్‌రెడ్డికి చెందిన 3.20ఎకరాల మక్కజొన్న పంట వరుస వర్షాలతో ఈమధ్యనే నేలకొరిగింది. దీంతో పంటను కోసేందుకు వీలుకాకపోవడంతో చేనులోనే ఉంచాడు. బుధవారం పంటను కోసేందుకు మిషన్ వచ్చింది.
ఇంతలోనే కరెంట్ వైర్ల నుంచి నిప్పు రవ్వలు రాలి సురేందర్‌రెడ్డికి చెందిన 3.20 ఎకరాలు, పక్కనే కౌలుకు తీసుకున్న కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన పెంబర్తి కుమారస్వామికి చెందిన ఎకరం పంట పూర్తిగా కాలిపోయాయి. మిగతా పంటలను మంటలు అంటుకోకుండా అక్కడే ఉన్న రైతులు ఆర్పేశారు. విషయం తెలుసుకున్న అగ్రికల్చర్ ఆఫీసర్లు పంట వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. ప్రమాదంలో రూ.3లక్షల వరకు నష్టం జరిగినట్లు రైతులు చెప్పారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ ఆఫీసులో వినతి పత్రం అందించారు. తమకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పియ్యాలని ఆఫీసర్లను వేడుకున్నారు.