మజ్లిస్​ మైండ్ ​గేమ్!... అజారుద్దీన్ ను ఓడించేందుకు ప్లాన్​

మజ్లిస్​ మైండ్ ​గేమ్!... అజారుద్దీన్ ను ఓడించేందుకు ప్లాన్​
  • మజ్లిస్​ మైండ్ ​గేమ్!
  • అజారుద్దీన్ ను ఓడించేందుకు ప్లాన్​

హైదరాబాద్,వెలుగు :  జూబ్లీహిల్స్​అసెంబ్లీ సెగ్మెంట్ లో మజ్లిస్ మైండ్​గేమ్ కు తెర తీసింది. తన మిత్రపక్షమైన బీఆర్ఎస్​ను గెలిపించేందుకు ప్లాన్ చేస్తుంది. పార్టీ అభ్యర్థిని పోటీలో నిలబెడతామని ప్రకటించినా.. బీఆర్​ఎస్​గెలుపునే ప్రిస్టేజ్ గా తీసుకుని పావులు కదుపుతుంది. దీంతో సెగ్మెంట్ పై అన్నిపార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. మజ్లిస్, బీఆర్ఎస్​ఎత్తులను కాంగ్రెస్​ఎలా చిత్తు చేస్తుందనే దానిపైనే ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్​ బీఆర్ఎస్​ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​​రెండోసారి గెలుపు సవాల్​గా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్​కు ప్రజల్లో ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ క్రికెటర్​అజారుద్దీన్​ను బరిలోకి దిపింది. దీంతో విస్తుపోయిన బీఆర్ఎస్​తన మిత్ర పక్ష పార్టీ మజ్లిస్​క్యాండిడేట్ ను నిలబెట్టనుంది. దీనిపై ఇటీవల మీడియాతో మజ్లిస్​అధినేత అసదుద్దీన్​ఓవైసీ జూబ్లీహిల్స్ లో  పోటీచేస్తామని స్పష్టం చేయడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.  

మైనార్టీల ఓటర్లే కీలకం

ఇక్కడ ఏ పార్టీ పోటీ చేసినా ముస్లిం మైనార్టీల ఓట్లు అధికంగా పడితేనే గెలుపు ఖాయం అవుతుంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్​అభ్యర్థిగా  మాగంటి గోపీనాథ్​, కాంగ్రెస్​ నుంచి పీజేఆర్​ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్​రెడ్డి, బీజేపీ నుంచి రావుల శ్రీధర్​రెడ్డి పోటీ చేశారు. 2014లో నవీన్​యాదవ్​మజ్లిస్​ తరఫున పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. 2018లో మజ్లిస్ ​పోటీ చేయలేదు. కానీ నవీన్​యాదవ్ ​ఇండిపెండెంట్​గా బరిలోకి దిగారు. ఆయనకు 18,817 ఓట్లు రావడం గమనార్హం. దీంతో మజ్లిస్ ​బరిలో లేక పోవడంతోనే బీఆర్ఎస్​ గెలుపు ఈజీ అయిందనే వాదన అప్పట్లో వినిపించింది. ఈసారి పరిస్థితి మారిపోయింది. బీఆర్ఎస్ ను గెలిపించేందుకే మజ్లిస్​ పోటీకి దిగినట్టు స్పష్టమవుతుంది. 

కాంగ్రెస్​కు చెక్ పెట్టేందుకే..

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్​ పుంజుకోవడం, బీఆర్ ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుండడంతో మజ్లిస్​ మద్దతుతో బీఆర్ఎస్​ గెలవాలని నిర్ణయించింది. నియోజక పరిధిలో భాగమైన షేక్​పేట, టోలీచౌకీ, బోరబండ తదితర ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉంటాయి. ఏ పార్టీ అభ్యర్థి గెలుపులోనైనా వీరి ఓట్లే కీలకం. కాంగ్రెస్​ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, బీజేపీ నుంచి లంకల దీపక్​ రెడ్డి ఖరారయ్యారు. మజ్లిస్​తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్​ అభ్యర్థి అజారుద్దీన్ ​సెలబ్రిటీ కావడం, నియోజకవర్గంలో ఉన్నతవర్గాలు వారు ఎక్కువగా నివసిస్తుండడంతో ఆయన వైపు ఓటర్లు ఇంట్రెస్ట్ చూపే చాన్స్​ ఉంది. ఆయన గెలుపును అడ్డుకునేందుకే మజ్లిస్​ అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. మజ్లిస్​ పోటీలో ఉంటే ముస్లిం మైనార్టీల ఓట్లు భారీగా చీల్చొచ్చు. దీంతో మిగతా వర్గాల ఓట్లతో మరోసారి గెలువ వచ్చనేది  బీఆర్​ఎస్​ వ్యూహంగా ఉంది. దీనికి మజ్లిస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం గమనార్హం. 

ALSO READ : లెటర్​ టు ఎడిటర్ .. ప్రచార ఆర్భాటం!