
- ఉమ్మడి జిల్లాకో స్కిల్ వర్సిటీ.. టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లపై ఫోకస్
- మన ఊరు–మన బడి ఖర్చులపై సమగ్ర విచారణ
- స్టూడెంట్లు లేరనే నెపంతో మూసేసిన స్కూళ్లు తిరిగి ఓపెన్
- ప్రైవేటు వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన
- ఇండ్లకిచ్చిన భూముల్లో ఆ వర్సిటీలకు పర్మిషన్లేందని ఫైర్
- ఎంక్వైరీ జరిపి రిపోర్టు అందజేయాలని ఆర్డర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో సర్కారు బడి ఉండాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బడి లేని పంచాయతీ అనే పేరు రాష్ట్రంలో వినిపించొద్దని.. ఎంత చిన్న ఊరైనా, మారుమూల తండా అయినా తప్పకుండా అందులో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. ఏ ఒక్క స్టూడెంట్ కూడా చదువు కోసం ఇతర ఊర్లకు, పట్టణాలకు పోయే పరిస్థితి రానివ్వొద్దని, స్థానికంగానే సౌకర్యాలు కల్పించాలన్నారు. స్టూడెంట్లు లేరనే నెపంతో మూసివేసిన అన్ని స్కూళ్లను తిరిగి తెరిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎంతమంది పిల్లలున్నా గవర్నమెంట్ స్కూళ్లను నడపాల్సిందేనని స్పష్టం చేశారు.
మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యాశాఖ, ప్రైవేట్ వర్సిటీలపై శనివారం సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులతో ‘మన ఊరు-– మన బడి’ కార్యక్రమం కింద చేసిన ఖర్చులపై సమగ్రంగా విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను ఉత్తమ స్కూళ్లుగా తీర్చిదిద్దాలని సూచించారు.
టీచర్ల ప్రమోషన్లకు అడ్డంకులు ఏమిటి?
ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల్లో ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులకు సీఎం సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పు కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులను నియమించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యాలను యువతకు అందించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘ కాల కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒరిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీల పనితీరుపై స్టడీ చేయాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిలాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందుకుగాను.. విద్యా శాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆయన అన్నారు.
ప్రైవేటు వర్సిటీలపై రిపోర్ట్ ఇవ్వండి
ప్రైవేటు యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కోసం అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులు అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేటు వర్సిటీ నడిపించుకోవడం సరికాదు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్స్మెంట్, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది లాంటి అన్ని అంశాలపై నివేదిక ఇవ్వండి” అని అధికారులకు ఆయన తేల్చిచెప్పారు. ఆయా వర్సిటీల్లోని వసతులు, సిబ్బంది అర్హతలు, ఎలాంటి ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తున్నాయో రిపోర్ట్ చేయాలన్నారు. ఇండ్ల స్థలాల కింద రిజిస్టర్ అయిన, వివాదంలో ఉన్న భూముల్లో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని సీఎం అన్నారు.
వీటిపై నివేదికను ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వల్ల గత విద్యా సంవత్సరం చాలామంది స్టూడెంట్లు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ‘‘ఇండ్ల ప్లాట్లకు రిజిస్ట్రేషన్ అయినట్లు ధరణిలో భూములు చూపిస్తున్నా.. ఆ భూముల్లో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. అలాంటి వర్సిటీల్లో ఎలాంటి విద్య అందుతున్నది? పరిస్థితులు ఏమిటి? అనే దీనిపై రిపోర్ట్ ఇవ్వండి” అని అధికారులను సీఎం ఆదేశించారు. సమీక్షా సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా, సీవోఈ జయప్రద, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, అడిషనల్ డైరెక్టర్లు లింగయ్య,జి.రమేశ్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.