సీఎం టూర్లు సక్సెస్ చేయండి : మంత్రి పొన్నం

సీఎం టూర్లు సక్సెస్ చేయండి : మంత్రి పొన్నం

జనసమీకరణపై దృష్టి పెట్టండి: పొన్నం 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో నాలుగు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జన సమీకరణ చేసి సీఎం టూర్​ను సక్సెస్ చేయాలని సూచించారు. బుధవారం గాంధీభవన్​లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, హైదరాబాద్ జిల్లా కీలక నేతలతో పొన్నం ప్రభాకర్ సమావేశమై మాట్లాడారు. 

‘‘అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ దగ్గర రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేస్తారు. బంజారాహిల్స్​లో అంబేద్కర్ భవన్, బైరామల్​గూడ ఫ్లై ఓవర్, ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేయనున్నారు’’అని పొన్నం తెలిపారు. డీసీసీ అధ్యక్షులు మీటింగ్​లు నిర్వహించి సీఎం ప్రోగ్రామ్​లను సక్సెస్ చేయాలని కోరారు.

పొన్నం వర్సెస్ అజారుద్దీన్

అక్బరుద్దీన్ ఒవైసీ స్కూల్​కు వెళ్లి పొన్నం ప్రభాకర్ చాయ్ తాగడాన్ని జూబ్లీహిల్స్ ఇన్​చార్జ్ అజారుద్దీన్ తప్పుబట్టారు. దీనిపై పొన్నం స్పందించారు. ‘‘చాంద్రాయణ్​​గుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్​కు వెళ్లాను. అక్బరుద్దీన్ ఒవైసీ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. వెళ్లి చాయ్ తాగితే తప్పేంటి? నాకు హైదరాబాద్​లో ఉన్న ఎమ్మెల్యేలందరూ సమానమే’’అని వివరణ ఇచ్చారు. దీంతో ఇరువురి మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో.. మీటింగ్ మధ్యలో నుంచే పొన్నం ప్రభాకర్ సెక్రటేరియెట్​కు వెళ్లిపోయారు. అజారుద్దీన్ అతిగా స్పందించారని, ఇది పెద్ద ఇష్యూనే కాదని కాంగ్రెస్ నేతలు అన్నారు.