
- 4.62 లక్షల విలువైన 308 కేజీల విత్తనాలు స్వాధీనం
- ముగ్గురిని అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు
సూర్యాపేట, వెలుగు: యూట్యూబ్ లో చూసి నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి రైతులకు అమ్ముతున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద రూ. 4. 62 లక్షల విలువైన 308 కేజీల నకిలీ విత్తనాలు, మెషీన్లు, ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట ఎస్పీ నరసింహ మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు.
తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన సింగారపు యాదగిరిస్వామి భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేయగా దిగుబడి రాలేదు. దీంతో పత్తి నుంచి గింజలు వేరు చేసి వాటిని విత్తనాలుగా తయారు చేసే మెషీన్ ను యూ ట్యూబ్లో చూసి కొనుగోలు చేశాడు.
నకిలీ విత్తనాలు తయారు చేస్తూ.. వాటిని బీటీ విత్తనాలుగా నమ్మించి నందపురం గ్రామానికి చెందిన నవీన్, చిత్త గూడూరుకు చెందిన సోమనారాయణకు తక్కువ రేటుకు పత్తి విత్తనాలను ఇస్తానని, బయట మార్కెట్ లో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చని నమ్మించాడు. కేజీ రూ.1500 చొప్పున 10 కేజీల పత్తి విత్తనాలను అమ్మగా.. వారు స్థానిక రైతులకు అధిక ధరకు విక్రయించారు.
లాభాలు వస్తుండగా మళ్లీ పత్తి విత్తనాలు కావాలని అతడిని కోరడంతో ఇద్దరికీ మరో 90 కేజీలు అమ్మాడు. తయారీపై అధికారులకు సమాచారం అందడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్ పోలీసులు దాడులు చేసి యాదగిరి స్వామిని పట్టుకున్నారు. అతని వ్యవసాయ భూమి వద్ద మెషీన్, రంగులు, సల్ఫ్యూరిక్ యాసిడ్స్ 15 క్యాన్లు, మూడు డ్రమ్ములను, 308 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని విచారించగా మరో ఇద్దరు ఉన్నట్లు తెలపడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయనే ఆశతో నకిలీ విత్తనాలను కొనుగోలు చేయొద్దని రైతులను ఎస్పీ కోరారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. సీసీఎస్ సీఐ శివ కుమార్, ఎస్ఐ హరికృష్ణ, ఏఎస్ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.