
తమిళనాడులోని రాజపాళ్యం ఊళ్లో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు తక్కువ. అక్కడి స్టూడెంట్స్ అంతా తమిళ మీడియంలోనే చదువుకున్నారు. అందుకే వాళ్లు ఉద్యోగం కోసం ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా రిజెక్ట్ అయ్యేవాళ్లు. ఊరి పిల్లల సమస్యను సాల్వ్ చేయడం కోసం ఆ ఊళ్లో డిగ్రీ పాసైన మలర్.. ఒక స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ పెట్టింది. అలాగే ఆ ఊరి నుంచి విదేశాలకు వెళ్లిన వాళ్లకు ఇంగ్లీష్ నేర్పడం కోసం ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది. అలా మొదలైన ఛానెల్.. ఇప్పుడు కొన్ని లక్షలమందికి ఇంగ్లీష్ నేర్పుతోంది.
మలర్ తండ్రి టీవీ మెకానిక్. ఇంటి సంపాదన అంతంత మాత్రంగా ఉండేది. దాంతో మలర్ చదువుకోవడానికి డబ్బుల్లేక కాలేజీకి కూడా వెళ్లలేదు. ఇంటర్మీడియెట్ తర్వాత ఆమెకు పెండ్లి చేశారు. కానీ, మలర్ ‘పెండ్లి తర్వాత కూడా చదువుకుంటాన’ని కాబోయే భర్తకు ముందే చెప్పి ఒప్పించింది. అలా పెండ్లయిన కొంతకాలానికి డిస్టెన్స్‌లో బీఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా ఉద్యోగం చేసింది. రాజపాళ్యం చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని వాళ్ల కోసం ‘కైజెన్ స్పోకెన్ ఇంగ్లీష్’ అనే కోచింగ్ సెంటర్ పెట్టింది. ఫీజు తీసుకోకుండానే పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పేది. ఆ ఊరి నుంచి విదేశాలకు వెళ్లి పని చేసుకుంటున్న కొంతమంది ‘మాకు కూడా ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్ నేర్పమ’ని మలర్‌ను అడిగారు. దానికోసం 2017లో మలర్.. ‘కైజెన్ ఇంగ్లీష్’ అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టింది.
అందరికీ అర్థమయ్యేలా..
మలర్‌కు బోర్డుపై క్లాసులు చెప్పిన అనుభవం ఉండడంతో యూట్యూబ్‌లో కూడా అదే టెక్నిక్ ఫాలో అయింది. ముందు ఒక కెమెరాను ఫిక్స్ చేసి, బోర్డుపై క్లాస్ చెప్తూ రికార్డ్ చేసేది. తన వీడియోలు ప్రత్యేకంగా ఉండడం కోసం మలర్ ‘6 మినిట్ ఇంగ్లీష్’ అనే కాన్సెప్ట్ తీసుకుంది. కేవలం ఆరు నిమిషాల్లో టాపిక్‌ను వివరించేది. ఇంగ్లీష్‌లో తప్పుగా పలికే పదాలు, ఇంగ్లీష్‌లో ఫోన్ సంభాషణలు, లెట్, కెన్, కుడ్, టిల్, ఇన్, ఎట్ లాంటి పదాలను ఎప్పుడు, ఎలా వాడాలి? లాంటి టాపిక్స్ తమిళంలో అర్థమయ్యేలా చెప్పేది. అలా ఆరు లేదా పది నిమిషాల వీడియోల రూపంలో తమిళంలో ఇంగ్లీష్ క్లాసులు చెప్పడం మొదలుపెట్టింది. అయితే మలర్ వీడియోలు స్కూల్లో చెప్పే పాఠాల్లాగ ఉండవు. రోజువారీ ఉదాహరణలతో అందరికీ అర్థమయ్యేలా చెప్పడం మలర్ స్పెషాలిటీ. అందుకే పిల్లల నుంచి తల్లుల వరకూ అందరూ మలర్ వీడియోలకు సబ్‌స్క్రయిబర్లుగా మారారు. అలా కొద్దిరోజుల్లోనే ‘కైజెన్ ఇంగ్లీష్’ ఛానెల్‌కు రీచ్ పెరిగింది.
నెగెటివ్ కామెంట్లు
మలర్ వీడియోలకు మంచి కామెంట్లతో పాటు నెగెటివ్ కామెంట్లు కూడా వచ్చేవి. కానీ అవేమీ పట్టించుకోకుండా మలర్ వీడియోలు చేస్తూనే ఉంది. సబ్‌స్క్రయిబర్లు పెరిగే కొద్దీ మలర్ యూట్యూబ్ వీడియోల స్టైల్ మార్చింది. బోర్డుపై చెప్పే పాఠాల నుంచి గ్రాఫిక్స్‌కు అప్‌డేట్ అయింది. తను లెసన్ చెప్తుండగా స్క్రీన్‌పై టెక్స్ట్ వచ్చేలా వీడియోలను ఎడిట్ చేసేది. థంబ్‌నెయిల్స్ అందంగా పెట్టడం నేర్చుకుంది. అలా నాలుగేళ్లలో కెజెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్.. వన్ మిలియన్ సబ్‌స్క్రయిబర్ల మార్క్ దాటింది.
కైజెన్ అంటే..
యూట్యూబ్ వీడియోలు చేస్తూనే మలర్ డిస్టెన్స్ ద్వారా ఎం.ఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది. రాజపాళ్యంతో పాటు చెన్నైలో మరో స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ మొదలుపెట్టింది. తన కోచింగ్ సెంటర్‌లో చదువుకునే పేద పిల్లలకు ఫీజు లేకుండానే క్లాసులు చెప్తోంది. ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడే పేదపిల్లలకు అలాగే సొంతంగా తమ కాళ్లపై నిలబడాలనుకునే హౌజ్‌వైవ్స్‌కు ఇంగ్లీష్ నేర్పడమే తన లక్ష్యమని మలర్ చెప్తుంటుంది. ‘కైజెన్’ అంటే జపనీస్‌లో ‘నిరంతర అభివృద్ధి’ అని అర్థం. ఏదైనా నేర్చుకునే వాళ్లు ఎప్పుడూ ఇంప్రూవ్ అవుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఆపేరు పెట్టానని అంటోంది మలర్.
స్టాటిస్టిక్స్ ఇవి..
కైజెన్ యూట్యుబ్ ఛానెల్‌కు నెలకు రెండు నుంచి మూడు లక్షల వరకూ ఆదాయం వస్తుంది. కైజెన్ ఛానెల్‌లో ఇప్పటివరకూ 478 వీడియోలు అప్‌లోడ్ అయ్యాయి. ప్రతి వీడియోకు 20 వేల నుంచి లక్ష వరకూ వ్యూస్ వస్తాయి. ఛానెల్‌కు ప్రస్తుతం1.08 మిలియన్ల సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. కైజెన్ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 37 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కైజెన్ కోచింగ్ సెంటర్ ద్వారా ఏటా వెయ్యి మంది ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు ‘మలర్ వల్ల మంచి ఉద్యోగాలకు మారాం’ అని కామెంట్లు పెడుతుంటారు. అలాగే తమిళనాడులోని చాలామంది గ్రామీణ విద్యార్ధులు ‘మలర్ వల్ల ఇంగ్లీష్ నేర్చుకుని ఉద్యోగాలు తెచ్చుకున్నామ’ని చెప్తుంటారు. మలర్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుని చిన్నచిన్న ఉద్యోగాల్లో చేరిన హౌజ్‌వైవ్స్ కూడా చాలామందే ఉన్నారు.