మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య  

V6 Velugu Posted on Jun 09, 2021

భద్రాచలం, వెలుగు: మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిని హత్య చేశారు. ఈ ఘటన భద్రాచలం మన్యంలోని దుమ్ముగూడెం మండలం కె.మారేడుబాక గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కుంజా భీమయ్య(65) భార్యతో కలిసి కె.మారేడుబాకలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.  అదే గ్రామానికి చెందిన తెల్లం శ్రీను, కుంజా లక్ష్మీనారాయణ, తెల్లం రాజారావు, మిడియం శ్రీనుల కుటుంబసభ్యులు అనారోగ్యం బారిన పడ్డారు. తెల్లం శ్రీను భార్యకు నాలుకపై పుండ్లు ఏర్పడి తగ్గకపోవడం, లక్ష్మీనారాయణ పెద్దకొడుకు 2 నెలల క్రితం డెంగ్యూ జ్వరంతో చనిపోవడం, రాజారావు తల్లికి చాలా రోజుల నుంచి కాళ్లు, చేతులు వాపు రావడం, మిడియం శ్రీను తండ్రి చనిపోవడం తదితర ఘటనలతో కుంజా భీమయ్యపై అనుమానం పెంచుకున్నారు.  దీంతో మే 12న రాత్రి పథకం ప్రకారం భీమయ్యను గుడ్డ తాడుతో పీకకు ఉరి వేసి చంపేశారు. తర్వాత నర్సాపురం గ్రామం  వద్ద గోదావరి ఇసుకలో పాతిపెట్టారు. ఏమీ తెలియనట్లుగా ఊరిలో తిరుగుతున్నారు. ఊళ్లో జరిగే పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుంజా భీమయ్య రాకపోవడంతో దుమ్ముగూడెం పోలీసులకు ఆయన కొడుకు తిరుపతిరావు ఫిర్యాదు చేశాడు. మే 15న మిస్సింగ్‍ కేసుగా నమోదు చేశారు. విచారణలో ఈ నలుగురు చంపినట్లు తేలడంతో వారిని వెంట పెట్టుకుని మంగళవారం నర్సాపురం గోదావరి ఇసుకలోకి వెళ్లారు. తహసీల్దారు, సీఐ, ఎస్సైల సమక్షంలో తవ్వి చూడగా గుర్తుపట్టడానికి వీలు లేకుండా మృతదేహం కన్పించింది. డాక్టర్లు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. నలుగురిపై కేసు ఫైల్​ చేసి రిమాండ్​ చేశారు.

Tagged mantras, Bhadrachalam., Man brutally murdere

Latest Videos

Subscribe Now

More News