ఔటర్ రింగ్ రోడ్డుపై  దారుణం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం

ఔటర్ రింగ్ రోడ్డుపై  దారుణం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం

మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి సజీవదహనం అయిన దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 2023, నవంబర్ 25వ తేదీ శనివారం అర్థ రాత్రి జిల్లాలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ పై వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల్లో పెద్ద ఎత్తున కారులో మంటలు వ్యాపించాయి.. కారులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని స్వాధీనం  చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కారు నెంబర్ ఆధారంగా మృతి చెందిన వ్యక్తిని కోదాడకు చెందిన వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం కోదాడ నుంచి వెంకటేష్ హైదరాబాద్ కు బయల్దేరినట్లు తెలుస్తోంది.  ఈ ఘటనపై అదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైన కారును తగలబెట్టారా? అనే కోణంలో క్లూస్ టీమ్ దర్యాప్తు చేస్తోంది.  ఈ  ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.