
పోలీసులు బండికి చలాన్ వేస్తే ఎవరైనా సరే ఆ ఫైన్ కట్టి బండి తీసుకుంటారు. కానీ, ఈ యువకుడు మాత్రం పోలీసుల మీద కోపంతో బైకుకే నిప్పుపెట్టాడు. బైకుకు చలాన్ రాయడంతో, సొంత బైకుకే నిప్పుపెట్టిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో న్యూ ఇయర్ రోజు జరిగిందీ ఘటన. సంగమ్ విహార్ నివాసి అయిన వికాస్ న్యూ ఇయర్ రోజు బైకుపై బయటకు వెళ్లాడు. గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో వికాస్ వాహనాన్ని ఆపిన పోలీసులు, హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడుపుతున్నాడని ఫైన్ విధించి, బైకును స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఆగ్రహానికిలోనైన వికాస్, అక్కడే పోలీసుల కళ్ల ముందే బైక్‌కు నిప్పుపెట్టాడు. హెల్మెట్ లేకుండా బండి నడిపినందుకు మరియు రోడ్డుపై బండిని తగలబెట్టినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.