
- వ్యక్తి పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకునేందుకు తుపాకీతో చెవిలో కాల్చుకుంటే.. అది తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న భార్య మెడలోకి దూసుకెళ్లిన ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉండగా.. ఏడు నెలల గర్భిణి అయిన భార్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫైరదాబాద్‌కు చెందిన వ్యక్తి ఐదు నెలల క్రితం గురుగ్రామ్‌లోని రామ్‌పురాలో భార్యతో కలిసి ఉంటున్నాడు. కాగా.. ఐదు నెలల నుంచి ఉద్యోగం లేకుండా ఉండటంతో భార్య భర్తల మధ్య గొడవలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భార్యను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లాడు. కారులో భార్యతో గొడవ తలెత్తడంతో తుపాకీ తీసుకుని కాల్చుకున్నాడని, అది అతని తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే కూర్చున్న భార్య మెడకు తగిలిందని డీజీపీ దీపక్ సహరణ్ చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు భార్య భర్తలిద్దరినీ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉందని, ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. భార్య పరిస్థితి కొంత మెరుగు పడిందని అన్నారు. నాలుగు రోజులుగా ఉద్యోగం విషయంలో గొడవ పడుతున్నామని, కారులో కూడా గొడవ అవడంతో కాల్చుకున్నాడని అతని భార్య స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తికి లైసెన్స్ ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. సాధారణంగా తుపాకీతో కాల్చుకుంటే బుల్లెట్ బయటకు వస్తుందని, కానీ ఇలా పక్కన వాళ్లకు తగలడం అరుదని డిసిపి దీపక్ సహరణ్ చెప్పారు.