
రైల్వే స్టేషన్ లో మనం హెచ్చరికల బోర్డ్ లను చూసే ఉంటాం. ప్రయాణికులకు విజ్ఞప్తి ప్రయాణికులు కదులుతున్న రైలు లోకి ఎక్కరాదు…. కదులుతున్న రైల్లో నుంచి దిగరాదంటూ రైల్వే స్టేషన్లలో తారసపడుతుంటాయి. కానీ కొంతమంది ప్రయాణికులు అవేం పట్టించుకోకుండా కదులుతున్న రైలెక్కడం, పట్టాలు దాటడంలాంటివి చేస్తుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి తృటిలో ప్రాణాలు తప్పించుకున్నాడు. ఆ ప్రయాణికుడికి నూకలు రాసిపెట్టి ఉన్నాయట్లుంది. వెంట్రుక వాసిలో కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి ప్రాణాలను దక్కించుకున్నాడు. కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించడంతో జారి అతడితల ప్లాట్‌ఫాంకు – రైలు మధ్య ఇరుక్కుంది. అయితే ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మెరుపువేగంతో ఒక్క ఉదుటున ప్రయాణికుణ్ని పట్టుకొని పక్కకి లాగాడు. దీంతో ప్రయాణికుడు ప్రాణాల్ని దక్కించుకున్నాడు. ఈ ఘటనలో ప్రయాణికుడు స్పృహ కోల్పోవడంతో పోలీసులు అతన్ని రైల్వే ఆస్పత్రికి తరలించారు.