
మహీంద్రా పాపులర్ ఎస్‌యూవీ (స్కార్పియో) వాహనం ఓ యూజర్ కు అనూహ్యమైన అనుభవానికి గురిచేసింది. మహీంద్రా సన్‌రూఫ్ కారు నుంచి వాటర్ లీక్ కావడంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ ఊహించని ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అరుణ్ పన్వార్ అనే వ్యక్తి.. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా.. అక్కడున్న ఓ కొండపై నుంచి జాలువారుతున్న ఓ చిన్న జలపాతాన్ని చూశారు. ఆ వాటర్ ఫాల్ కింద తన కారును శుభ్రం చేయాలని నిశ్చయించుకొని.. తన సన్‌రూఫ్‌ను క్లోజ్ చేసి కారును జలపాతం కిందకు తీసుకెళ్తాడు. అంతే ఇక సన్‌రూఫ్ , స్పీకర్స్ నుంచి నీరంతా కారు క్యాబిన్‌లోకి వచ్చేసింది. దీంతో వెంటనే తన కారును జలపాతం కింద నుంచి పక్కకు తీసి... సన్‌రూఫ్ మూసి ఉందా, లేదా అని మరోసారి చెక్ చేసుకుంటాడు. అయితే అప్పటికే నీరు మొత్తం కారులోకి ప్రవేశించి.. ముందు సీటు మొత్తం తడిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘నా జీప్ మెరిడియన్‌ని చాలాసార్లు ఇలా కడిగాను. కానీ నాకు ఎప్పుడూ ఇలా కాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘అందుకే నేను మహేంద్రా కార్లు కొనను.. నా సైకిల్ తోనే చాలా సంతృప్తిగా ఉన్నా’ అంటూ మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. కారును జలపాతంకిందకు తీసుకెళ్లిన సమయంలో కారులోని ముందు సీటు కవర్‌తో కప్పబడి ఉండటంతో నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యక్తి సన్ రూఫ్‌ను కొద్దిగా తెరిచి ఉంచాడేమోనని పలువురు భావిస్తున్నటు కామెంట్లు పెడుతున్నారు.