
న్యూఢిల్లీ: మహీంద్రా & మహీంద్రా (ఎం & ఎం) కు ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ. 2,361 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. ఆటోమోటివ్, ఫార్మ్ సెక్టార్‌లోని బిజినెస్‌లు మంచి పనితీరు కనబరచడంతో ఎం & ఎం లాభం పెరిగింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో కంపెనీకి రూ. 332 కోట్ల నష్టం వచ్చింది.
గత రెండేళ్లుగా ఇబ్బంది పెడుతున్న సెమికండక్టర్ల కొరత చాలా వరకు తీరిందని కంపెనీ పేర్కొంది. ఎం & ఎం ఆదాయం జూన్ క్వార్టర్‌లో రూ. 28,412 కోట్లకు పెరిగింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో రూ. 19,172 కోట్ల రెవెన్యూని కంపెనీ ప్రకటించింది. ఆటోమోటివ్ సెగ్మెంట్ నుంచి కంపెనీకి రూ. 12,741 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్ నుంచి కంపెనీకి రూ. 8,428 కోట్ల రెవెన్యూ వచ్చిందని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది.