
- అకాల వర్షాలు, ఈదురుగాలులతో తగ్గిన దిగుబడి
- రాలిన కాయలు, నాణ్యత పేరుతో రేట్లలో కోత
- ఈ ఏడాది మామిడి రైతులకు నిరాశే
- వ్యాపారుల దోపిడీని అడ్డుకోవాలని కోరినాపట్టించుకోని అధికారులు
సూర్యాపేట, వెలుగు : జిల్లాలో మామిడి రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. అకాల వర్షాలు, ఈదురుగాలులతో దిగుబడి భారీగా తగ్గింది. ఒకవైపు అకాల వర్షాలతో మామిడి దిగుబడి తగ్గడం, మరోవైపు ధరల్లో కోతలు పెట్టడంతో రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడి కాయలను మార్కెట్ తీసుకొస్తే రాలిన కాయలంటూ తక్కువ ధరకు రేటు కడుతున్నారు. దీనికి తోడు తోటల నుంచి డీసీఎం, ట్రాక్టర్లు, ఆటోల్లో మార్కెట్ కు తరలించి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యమైన మామిడి కాయలు మార్కెట్ కు తీసుకొచ్చినా వ్యాపారులు సిండికేట్ గా మరి తాము చెప్పిన రేట్ కే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారుల దోపిడీని అడ్డుకోవాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తూకంలో భారీగా కోత..
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్డు నుంచి హైవేకు ఇరువైపులా కొత్త బస్టాండ్ వరకు ఉన్న మామిడి మార్కెట్కు రైతులు రోజుకు సుమారు 200 టన్నుల కాయలు తీసుకొస్తారు. కమీషన్ ఏజెంట్ల ద్వారా వ్యాపారులకు విక్రయిస్తుంటారు. వాటిని కొన్నవారు మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు అధిక ధరకు ఎగుమతి చేస్తారు.
మార్కెట్లో వ్యాపారులు ఒకసారి ధర నిర్ణయించిన తర్వాత మళ్లీ మార్చొద్దు. కానీ కాంటా అయ్యాక లోపల కొంతకాయ పాడైపోయిందని ధరలు తగ్గిస్తూ తూకంలో కోత విధిస్తున్నారు. సూట్ పేరిట టన్నుకు క్వింటాల్ కోత పెడుతూ 6 నుంచి 8 శాతం కమీషన్ వసూళ్లు చేస్తున్నారు. దీంతో రూ.100కు రూ.10 నుంచి రూ.15 వరకు నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు.
ప్రైవేట్ మార్కెట్లే దిక్కు..
ఈ సీజన్లో మామిడి దిగుబడి తగ్గడంతో ఏ రైతు కూడా బాటసింగారంలోని జాతీయ పండ్ల మార్కెట్కు తరలించలేని పరిస్థితి. ఈ మార్కెట్ జిల్లాకు సుమారు 100 కిలోమీటర్ల దూరాన ఉంది. దీంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ మార్కెట్లలోనే అమ్ముకుంటున్నారు.
వాస్తవానికి దిగుబడి తగ్గినప్పుడు ధర పెరగాలి. కానీ వ్యాపారుల ధరలు తగ్గించి కొంటున్నారు. బంగినపల్లి మామిడి ఎంత క్వాలిటీగా ఉన్నా టన్నుకు రూ.40 వేలకు మించడం లేదని రైతులు అంటున్నారు. గతేడాది మొదటి రకం మామిడి టన్ను ధర రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పలికింది. అయితే ఈసారి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పెరిగింది. ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణ లోపించడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు చెబుతున్నారు.
మామిడి వ్యాపారుల సిండికేట్..
అకాల వర్షాలకు మామిడి పంటను కాపాడుకొని మార్కెట్ కు తీసుకొస్తే రైతులకు తీవ్ర నిరాశే మిగులుతుంది. కష్టపడి పంట పండిస్తే ఒక్క శాతం కూడా లాభం రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట మార్కెట్ లో వ్యాపారులు సిండికేట్ గా మారి వారు చెప్పిన ధరలకే అమ్మకాలు జరిగేలా ఒత్తిడి తెస్తున్నారు.
ఒకవేళ వారిని కాదని ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తే వారిని కూడా కొనుగోలు చేయకుండా వ్యాపారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో మామిడి సీజన్ ముగుస్తుందని, ఇకనైనా అధికారులు వ్యాపారుల సిండికేట్ ను అడ్డుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.