చక్కెర, కేక్​ పౌడర్‌‌‌‌‌‌‌‌తో గుడుంబా - రూట్​మార్చిన తయారీదారులు

చక్కెర, కేక్​ పౌడర్‌‌‌‌‌‌‌‌తో గుడుంబా - రూట్​మార్చిన తయారీదారులు

 

  • బెల్లం, స్పటికపై ఆంక్షలుండడంతో వీటి వాడకం
  • విస్తుపోతున్న ఎక్సైజ్​ ఆఫీసర్లు
  • పల్లెల్లో మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా 

జయశంకర్ భూపాలపల్లి, మహాముత్తారం, వెలుగు: ఎక్సైజ్ శాఖ ఎన్ని ఆంక్షలు పెట్టినా గుడుంబా తయారీ మాత్రం ఆగడం లేదు. కాకపోతే గుడుంబా తయారీదారులు రూట్​ మార్చారంతే. నల్లబెల్లం, స్పటికపై కఠిన ఆంక్షలు ఉండడంతో అవి లోకల్‌‌‌‌గా దొరకడం లేదు. దీంతో తయారీదారులు వీటి కన్నా తక్కువ ధరలో దొరికే చక్కెర,  బేకరీల్లో దొరికే కేక్​పౌడర్‌‌‌‌‌‌‌‌తో గుడుంబా రెడీ చేస్తున్నారు. దీంతో ఏజెన్సీ ఏరియాలోని గ్రామాల్లో గుడుంబా షాపులు, కిరాణా దుకాణాల్లో బస్తాల కొద్దీ చక్కెర కనిపిస్తోంది.  బ్రాందీ, విస్కీలకు రేట్లు పెరగడంతో మందుబాబులు తక్కువ రేటుకే గుడుంబాను ఎగబడి తాగుతున్నారు.  ఇటీవల జరిగిన మేడారం మహా జాతరకు వ్యాపారులు లక్షలాది లీటర్ల గుడుంబాను తరలించినట్లు తెలిసింది. 

చక్కెర, కేక్​ పౌడర్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ 

బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో బెల్లం కేజీకి రూ.70 నుంచి రూ.100కు దొరుకుతుంది. అది కూడా ఎక్కువ మొత్తంలో అమ్మడానికి వీలు లేదు. 10 కేజీలకు మించి ఎవరికైనా బెల్లం అమ్మితే వాళ్ల ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డు చూపాలని ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ నిబంధనలు ఉన్నాయి.  చక్కెర అయితే కేజీ రూ.35 నుంచి రూ. 40 వరకు లభించడమే కాకుండా.. క్వింటాళ్ల కొద్దీ కొన్నా ఎవరికీ లెక్క చెప్పనవసరం లేదు.  దీన్ని ఆసరాగా చేసుకున్న గుడుంబా తయరీదారులు  నల్లబెల్లం, స్పటికకు బదులుగా చక్కెరకు బేకరీలలో దొరికే కేక్ పౌడర్​ను కలిపి మాల్ రెడీ చేస్తున్నారు.  దీంతో మార్కెట్‌‌‌‌లో చక్కెరతో పాటు కేక్​ పౌడర్​కు భారీగా డిమాండ్​ పెరిగింది.  వ్యాపారులు సైతం వీటిని పెద్ద ఎత్తున తెప్పిస్తున్నారు. ఏ కిరాణ దుకాణం చూసినా క్వింటాళ్ల కొద్దీ చక్కెర నిల్వలు కనిపిస్తుండడం 
గమనార్హం. 

బార్డర్ దాడిస్తున్నరు

భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, కాటారం, మహాదేవ్​పూర్​, పలిమెల, మల్హర్​ మండలాల్లోని పల్లెల్లో గుడుంబా తయారీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మహాముత్తారం, యామన్​పల్లి, కొర్లకుంట, నిమ్మగూడెం, పెగడపల్లి, ప్రేమ్​నగర్, పలిమెల మండలం  సర్వాయిపేట, పలిమెల, పంకెన, కామన్​పల్లి, కాటారం మండలం కొత్తపల్లి, గట్లకుంట మల్హర్ మండలం తూండ్ల, పెద్దతూండ్ల గ్రామాల్లో నాటుసారాను తయారు చేసి సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల్లోని బార్డర్​ గ్రామాలకు తరలిస్తున్నారు.  ఇందుకోసం నైట్​టైంలో టూ వీలర్లను వాడుతున్నట్లు సమాచారం.  ఎక్సైజ్​ శాఖ  అధికారులు దాడులు చేస్తున్నా తయారీదారులు రూట్‌‌‌‌ మారుస్తుండడంతో గుడుంబా దందా మాత్రం ఆగడంలేదు.