
హైదరాబాద్, వెలుగు: బిందువు బిందువు కలిసి సింధువులా మారినట్టు.. ఒక్కరిద్దరితో మొదలైన తెలంగాణ ఉద్యమం మహోద్యమమైంది. ఆ ఉద్యమానికి బీజం పడింది ‘ఉద్యోగాల’ కోసమే. ముల్కీ (స్థానికుల)కు ఉద్యోగాల్లో తీరని అన్యాయం జరుగుతుండడం, నాన్ ముల్కీ (స్థానికేతరుల)కు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తుండడంతో విద్యార్థులే ‘ముల్కీ ఉద్యమానికి’ ఊపిర్లూదారు. ఉద్యోగాల బ్యాగ్రౌండ్‌తో 1952లో ఓరుగల్లులో టీచర్ల బదిలీల దగ్గర మొదలైన ఆ ఉద్యమం కాస్తా.. నీళ్లు, నిధులను కలుపుకొని ముందుకు సాగింది. సబ్బండవర్గాల పోరాటాలు, నిరసనలు, బలిదానాలు, వంటావార్పులు, సకలజనుల సమ్మెలు, మిలియన్మార్చ్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
పోరు తెలంగాణ : ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ నినాదంతో మొదలు
- 1952 జులై 26: హనుమకొండ హైస్కూల్లో స్థానిక టీచర్లను బదిలీ చేసి స్థానికేతరులకు అవకాశం ఇచ్చారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు.. అప్పటి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ షెండార్కర్ వచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా తొలిసారిగా విద్యార్థులు నిరసన చేపట్టారు.
- 1952 ఆగస్టు 29: తీవ్రరూపం దాల్చిన విద్యార్థుల నిరసన. వారిపై పోలీసుల లాఠీచార్జ్. హైదరాబాద్‌కూ చేరిన నిరసనలు.
- 1952 సెప్టెంబర్ 2: ‘నాన్ ముల్కీ’ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ ఘర్ కో జావో, స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్ అంటూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు.
- 1952 సెప్టెంబర్ 3: హైదరాబాద్‌లో ర్యాలీలు, సమావేశాలను నిషేధిస్తూ అప్పటి నగర కొత్వాల్ ఆదేశాలు. వెంకటస్వామి, ముల్చంద్ లక్ష్మీ నారాయణ, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి రాజకీయ నాయకులతో పాటు, విద్యార్థులను నిలువరించేందుకు పోలీసుల చర్యలు. దీంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. విద్యార్థులకు స్థానికులూ జత కలిశారు. పోలీసులు, విద్యార్థుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. పోలీసులు కాల్పులు జరిపారు. ఇద్దరు స్టూడెంట్లు స్పాట్లోనే చనిపోగా.. ఇంకో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు.
- 1952 సెప్టెంబర్ 4: మృతదేహాల కోసం ఉస్మానియా ఆస్పత్రి వద్ద వారి కుటుంబీకులు, విద్యార్థుల ఆందోళన. నిరసన జరుగుతుండగానే పోలీసులు రహస్యంగా మృతదేహాలను మీర్ ఆలం ట్యాంక్ సమీపంలో పూడ్చి పెట్టారు. విషయం తెలిసి అప్పటి సీఎం బూర్గుల రామకృష్ణారావు సీరియస్ అయ్యారు. మృతదేహాలను అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే, నిరసనకారులు సీఎం అధికారిక కారును దహనం చేశారు. దీంతో పోలీసులు మళ్లీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోనూ మరో నలుగురు చనిపోయారు.
- 1952 సెప్టెంబర్ 7: ‘ముల్కీ రూల్స్’ మీద అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. పోలీసుల కాల్పుల ఘటనలపై జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ నియామకం.
- 1952 డిసెంబర్ 28: సీఎం బూర్గుల రామకృష్ణారావు, డీజీపీ, ఐజీపీ సహా వంద మందిని విచారించిన జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ.. నివేదికను సమర్పించింది. విద్యార్థులు, పోలీసులు సంయమనం పాటిస్తే ఘటన జరిగి ఉండేది కాదని పేర్కొంటూ రిపోర్ట్. రెండు కమిటీల నియామకంతో ఈ ఉద్యమం ఆగింది.
- 1953: వివిధ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు. అందులో హైదరాబాద్ రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త ప్రాంతాలుగా విడగొట్టి.. తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్‌తో కలిపేందుకు అధ్యయనం.
- 1955 మార్చి 5: హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం పట్ల అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ‘‘ఒక అమాయకపు అమ్మాయిని.. నాటీ అబ్బాయికిచ్చి పెండ్లి చేస్తున్నం. వాళ్లు కలిసి ఉండొచ్చు. ఇమడలేకపోతే విడిపోవచ్చు’’ అని అన్నారు.
- 1955 డిసెంబర్ 3: తెలంగాణ విలీనంపై హైదరాబాద్ అసెంబ్లీలో తీర్మానం. 174 మంది ఎమ్మెల్యేల్లో (మరాఠీ, కన్నడ వాళ్లు కలిపి) 147 మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 103 మంది తీర్మానానికి ఆమోదం తెలిపారు. 16 మంది న్యూట్రల్‌గా, 29 మంది వ్యతిరేకంగా ఓట్ వేశారు. 94 మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో 25 మంది విలీన తీర్మానాన్ని వ్యతిరేకించారు. 59 మంది ఆమోదించారు. అయితే, ‘ప్రజల ఆకాంక్ష మేరకే విలీనం చేస్తున్నం’ అనే మాటను చేర్చాలంటూ తెలంగాణ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో తీర్మానంపై ఓటింగ్ జరగలేదు.
- 1956 ఫిబ్రవరి 20: విలీనంపై తెలంగాణ, ఆంధ్రా నాయకుల మధ్య రాజీ కుదిర్చేందుకు జెంటిల్మెన్ అగ్రిమెంట్(పెద్దమనుషుల ఒప్పందం).
- 1956 నవంబర్ 1: తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు.