చత్తీస్ ఘడ్‌లో మావోయిస్టులు ఓ ఎస్సైని హతమార్చారు. బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ వద్ద ఎస్సై తాతి మురళిని మావోయిస్టులు మూడు రోజుల క్రితం ఏప్రిల్ 21న కిడ్నాప్ చేశారు. అనంతరం రెండు రోజుల తర్వాత శుక్రవారం రాత్రి మురళిని మావోయిస్టులు హత్యచేసి పుల్సుమ్ పారా వద్ద మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లారు. మృతదేహం వద్ద పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో ఓ లేఖను కూడా మావోయిస్టులు వదిలిపెట్టి వెళ్లారు.
ఎస్సై మురళి 2006లో సల్వా జుడుం మొదలు 2021 వరకు డీఆర్‌జీ పోలీసు శాఖలో పనిచేస్తూ ఛత్తీస్ ఘడ్‌లోని పలు ఆదివాసీ గ్రామాలలో అమాయక ఆదివాసీ గిరిజనులను హత్య చేశాడని మరియు ఆదివాసీ మహిళలను అత్యాచారం చేశాడని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించి మురళికి పలుమార్లు హెచ్చరికలు కూడా చేశామని.. అయినా కూడా ప్రవర్తన మార్చుకోకపోవడంతో ప్రజాకోర్టు నిర్వహించి చంపినట్లు మావోయిస్టులు మృతదేహం వద్ద వదలిపెట్టిన లేఖలో తెలిపారు. కాగా.. ఎస్సై మురళిని విడిచిపెట్టాలని గోండ్వానా సమితి వారు మధ్యవర్తిత్వం చేస్తుండగానే.. మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
