ఇన్‌ఫ్లేషన్ డౌన్‌..మార్కెట్ అప్‌.. సెన్సెక్స్ 182, నిఫ్టీ 88 పాయింట్లు జంప్..

ఇన్‌ఫ్లేషన్ డౌన్‌..మార్కెట్ అప్‌.. సెన్సెక్స్ 182, నిఫ్టీ 88 పాయింట్లు జంప్..

ముంబై:  రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల దాదాపు ఆరు సంవత్సరాల కనిష్ట స్థాయి 3.16 శాతానికి తగ్గడంతో బుధవారం ఈక్విటీ బెంచ్‌‌‌‌మార్క్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీ లాభాలతో ముగిశాయి. ధరల తగ్గుదల వల్ల ఆర్​బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. దీనికితోడు ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలకు విరామం ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోరణికి తోడ్పడిందని ట్రేడర్లు తెలిపారు. దీంతో 30-షేర్ల బీఎస్​ఈ బెంచ్‌‌‌‌మార్క్ గేజ్ సెన్సెక్స్ 182.34 పాయింట్లు పెరిగి 81,330.56 వద్ద స్థిరపడింది. ఇది 81,691.87 గరిష్ట స్థాయిని,  80,910.03 కనిష్ట స్థాయిని తాకింది. 

ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 88.55 పాయింట్లు పెరిగి 24,666.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కంపెనీల్లో టాటా స్టీల్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, మారుతి, మహీంద్రా అండ్​ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్​సీఎల్​ టెక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్,  భారతీ ఎయిర్‌‌‌‌టెల్ ఎక్కువగా లాభపడ్డాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో భారతీ ఎయిర్‌‌‌‌టెల్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఐదు రెట్లు పెరిగి రూ.11,022 కోట్లకు చేరుకోవడంతో షేర్లు దూసుకెళ్లాయి. 

అయితే, ఆసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్​టీపీసీ,  పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. టాటా మోటార్స్​కు మార్చి క్వార్టర్లో కన్సాలిడేటెడ్ నికర లాభం 51 శాతం తగ్గి రూ.8,556 కోట్లకు పడిపోవడంతో ఈ కంపెనీ షేర్లు ఒకశాతానికి పైగా తగ్గాయి.  గత నెల టోకు ధరల ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్ట స్థాయి 0.85 శాతానికి తగ్గిందని ప్రభుత్వ డేటా బుధవారం చూపించింది.

విదేశీ మార్కెట్లు ఇలా..

ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, షాంఘై  ఎస్​ఎస్​ఈ కాంపోజిట్ ఇండెక్స్,  హాంకాంగ్  హాంగ్ సెంగ్ లాభపడగా, జపాన్  నిక్కీ 225 ఇండెక్స్ నష్టాల్లో ముగిశాయి. యూరప్‌‌‌‌లోని మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గ్లోబల్​చమురు బెంచ్‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 1.13 శాతం తగ్గి బ్యారెల్‌‌‌‌కు 65.88 డాలర్లకు చేరుకుంది. 

మార్కెంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌‌‌‌ఐఐలు) మంగళవారం రూ.476.86 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. మంగళవారం సెన్సెక్స్ 1,281.68 పాయింట్లు పడిపోయి 81,148.22 వద్ద స్థిరపడింది. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఇ నిఫ్టీ 346.35 పాయింట్లు తగ్గి 24,578.35 వద్ద ముగిసింది.