మారుతీ డీజిల్ కార్లు మళ్లీ వస్తున్నాయ్

మారుతీ డీజిల్ కార్లు మళ్లీ వస్తున్నాయ్

ఎస్‌‌యూవీ సెగ్మెంట్లకు డిమాండ్

డీజిల్ కార్లనే కోరుకుంటోన్న జనాలు

బీఎస్ 6 కంప్లియెంట్‌‌తో వచ్చే ఏడాది మార్కెట్లోకి డీజిల్ కార్లు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి మళ్లీ డీజిల్ సెగ్మెంట్‌‌లోకి ఎంటర్ కాబోతుంది. వచ్చే ఏడాది డీజిల్ సెగ్మెంట్‌‌లోకి రావాలని చూస్తున్నట్టు చెప్పింది.  ఎస్‌‌యూవీ, మల్టి పర్పస్ వెహికల్ సెగ్మెంట్లలో ఎక్కువ మంది కస్టమర్లు డీజిల్ వెహికల్స్‌‌ కోసమే చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  మానేసర్ ప్లాంట్‌‌ను అప్‌‌గ్రేడ్ చేస్తోందని, వచ్చే ఏడాది ఫెస్టివ్ సీజన్ లేదా మిడిల్ కల్లా బీఎస్ 6 డీజిల్‌ ఇంజిన్లను ప్రవేశపెడుతుందని తెలిపాయి. బీఎస్ 6 కంప్లియెంట్ డీజిల్ ఇంజిన్‌‌ను తొలుత ఎర్టిగా, విటారా బ్రెజాలో అమర్చాలని కంపెనీ ప్లాన్ చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే డీజిల్ సెగ్మెంట్‌‌లోకి ఎందుకు మళ్లీ ఎంటర్ అవుతుందో మారుతీ సుజుకి కారణాలను వెల్లడించలేదు. మారుతీ సుజుకి మొత్తం కార్లు ఇప్పుడు బీఎస్ 6 కంప్లియెంట్‌‌తో 1 లీటరు, 1.2 లీటరు, 1.5 లీటరు గ్యాసోలైన్ ఇంజిన్స్‌‌తో ఉన్నాయి. కొన్ని మోడల్స్‌‌లో సీఎన్‌‌జీ వెర్షన్లను అమ్ముతోంది.

ఈ ఆటో కంపెనీ తన పోర్ట్‌‌ఫోలియో నుంచి డీజిల్ మోడల్స్‌‌ను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిస్‌‌కంటిన్యూ చేసింది. బీఎస్ 6 ఎమిషన్ నార్మ్స్‌‌ను కచ్చితంగా అమలు చేయాలనే నిబంధనతో ఈ నిర్ణయం తీసుకుంది. బీఎస్ 6 కంప్లియెంట్‌‌ ఇంజిన్లతో చిన్న డీజిల్ కార్లను తేవడం ద్వారా ధరలపై ప్రభావం పడుతుందని 2019లో మారుతీ సుజుకి ఛైర్మన్ ఆర్‌‌‌‌సీ భార్గవ అన్నారు. ఒకవేళ కస్టమర్ల నుంచి డిమాండ్ వస్తే.. తీసుకొస్తామని చెప్పారు. డీజిల్‌‌తో రూపొందే పెద్ద ఎస్‌‌యూవీలకు, సెడాన్లకు కస్టమర్లు వస్తే తాము కూడా బీఎస్ 6 డీజిల్‌‌ ఇంజిన్‌‌తో వస్తామని అప్పుడే కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.

మారుతీ సుజుకి డీజిల్ కార్లను ఆపివేసినప్పటికీ.. రెండో అతిపెద్ద కారు కంపెనీ హ్యుండాయ్ మోటార్ మాత్రం డీజిల్ మోడల్స్‌‌ను ఆపివేయలేదు. ప్రస్తుతం 1.2 లీటరు, 1.5 లీటరు, 2 లీటరు కెపాసిటీ ఇంజిన్లతో బీఎస్ 6 కంప్లియెంట్ డీజిల్ ఇంజిన్లను ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా స్మాల్ కెపాసిటీ ఇంజిన్ల విషయంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. బీఎస్ 6 కంప్లియెంట్‌‌తో డీజిల్ ఇంజిన్ తెస్తే చిన్న డీజిల్ కార్లు చాలా ఖరీదైనవిగా మారతాయని, అప్పుడు కస్టమర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపరని భావిస్తున్నాయి. టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ లాంటివి చిన్న కెపాసిటీ డీజిల్ ఇంజిన్లను ఆపివేశాయి.