- గొంతు కోసి దుండగుల పరారీ
- షాదనగర్లో పట్టపగలే దారుణం
షాద్‌నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఓ మేస్త్రిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి, గొంతు కోసి పరారయ్యారు. చౌదర్‌గూడ మండలం పెద్ద ఎలికిచర్ల గ్రామానికి చెందిన జయరాం గత కొన్నేండ్లుగా షాద్‌నగర్‌లో నివాసం ఉంటూ మేస్త్రి పనులు చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఆయన పరిగి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో ఉండగా.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అకస్మాత్తుగా అక్కడకు చేరుకున్నారు. క్షణాల వ్యవధిలోనే జయరాంపై కత్తులతో విరుచుకపడి, విచక్షణారహితంగా పొడిచి, గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయారు.
తీవ్రంగా గాయపడిన జయరాంను స్థానికులు, పోలీసులు కలిసి వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం జయరాం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. ఈ దారుణానికి పాత కక్షలేమైనా కారణమా..? లేక వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా..? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
