కొండగట్టు ఆలయంలో భారీగా అవినీతి .. ఆడిటింగ్ లో బట్టబయలు

కొండగట్టు ఆలయంలో భారీగా అవినీతి ..  ఆడిటింగ్ లో బట్టబయలు

కొండగట్టు,వెలుగు : కొండగట్టు ఆలయం లో భారీ అవినీతి చోటుచేసుకుంది. కొంద రు అధికారుల వల్ల దేవాలయానికి రావలసిన ఆదాయానికి భారీగా గండి పడింది. కొద్దిరోజుల క్రితం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసాచారి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈవో వెంకటేశ్​ సస్పెండ్​ చేశారు. మరికొందరు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో మంగళవారం అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి తనిఖీకి వచ్చారు. ఆడిటింగ్​లో భాగంగా 2022 నుంచి 2024 వరకు జరిగిన లావాదేవీల్లో రూ.52 లక్షల మేర అవినీతి జరిగినట్టు ఆమె గుర్తించారు. 2018, 19 సంవత్సరాల్లో కూడా అక్రమాలు చేశారని తేల్చారు. కొండగట్టు ఇంజినీరింగ్ విభాగంలో కూడా 48 లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయని గుర్తించామన్నారు. 2018 నుంచి అన్ని రికార్డులు స్వాధీనం చేసుకొని హైదరాబాద్ కమిషనర్ ఆఫీసుకు తరలిస్తామన్నారు. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఈవో వెంకటేశ్​, ఏఈఓ అంజయ్య పాల్గొన్నారు.