శ్రీరాం సాగర్కు భారీగా పెరుగుతున్న వరద

 శ్రీరాం సాగర్కు భారీగా పెరుగుతున్న వరద

నిజామాబాద్ జిల్లా: భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. ఎగువన నది పరివాహక ప్రాంతాలతోపాటు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద పరవళ్లు తొక్కుతోంది. రాత్రి 8 గంటల సమయానికి ఇన్ ఫ్లో 1 లక్ష 8 వేల 540 క్యూసెక్కులు నమోదు అయింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో శ్రీరాం సాగర్ కు వరద మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహానికి అనుగుణంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టాన్ని నియంత్రిస్తున్నారు. 
ప్రస్తుతం 22 గేట్లు ఎత్తి 99వేల 890 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు సామర్థ్యం 90 టీఎంసీలు కాగా..  అధికారులు 1091.0 అడుగుల నీటిమట్టంతో 90.313టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతూ నీటి విడుదల కొనసాగిస్తున్నారు. డ్యాం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో వస్తున్న వరద నీటిని వస్తున్నట్లే దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. ముందు జాగ్రత్తగా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.