మాంసం ధరలు పైపైకి..

మాంసం ధరలు పైపైకి..
  • నెల రోజుల్లో వంద పెరిగిన రేటు
  • స్కిన్ లెస్ కిలో రూ.300, స్కిన్ తో రూ. 250, లైవ్ కోడి రూ. 190 
  • దాణా రేట్లు పెరగడం, ఉత్పత్తి తగ్గడమే కారణం  
  • మటన్ కూడా మస్తు పిరం.. కిలో రూ.800 

హైదరాబాద్‌‌/మహబూబ్​నగర్, వెలుగు: ఆదివారం వచ్చిందంటే ఇంత చికెనో, మటనో తెచ్చుకోవాలని అనుకుంటాం.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, ముక్క ముట్టేటట్టు లేదని జనం అంటున్నరు. నెల రోజుల్లోనే మాంసం మస్తు పిరమైంది. చికెన్‌‌ ట్రిపుల్‌‌ సెంచరీ కొట్టింది. కిలో చికెన్‌‌ రూ.100 పెరిగింది. పోయిన నెలలో స్కిన్‌‌లెస్‌‌ కిలో రూ.180 ఉండగా, ఇప్పుడు రూ.280 నుంచి రూ.300 పలుకుతోంది. ఇక స్కిన్ చికెన్‌‌ రూ.160 నుంచి రూ.250కి పెరగ్గా, లైవ్‌‌ కోడి ధర రూ.190కి చేరింది. రేట్లు పెరగడంతో బిజినెస్ డల్ అయిందని వ్యాపారులు అంటున్నారు. ప్రతి ఆదివారం 40 కోళ్లు అమ్మేవాడినని, కానీ ఈసారి 20 కోళ్లు కూడా తెగలేదని హైదరాబాద్ దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌లోని ఓ వ్యాపారి చెప్పారు. మరోవైపు మటన్ కూడా మస్తు పిరమైంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో చలి ఎక్కువగా ఉండడంతో.. జీవాలు బరువు పెరగడం లేదని, కొన్ని రోగాలొచ్చి చనిపోతున్నాయని పెంపకందార్లు రేట్లు  పెంచేశారు. దీంతో వ్యాపారులూ రేట్లు పెంచారు. ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరగడంతో డిసెంబర్​లో కిలో మటన్​ రూ.650, జనవరిలో రూ.680 నుంచి రూ.700 వరకు అమ్మారు. ఫిబ్రవరిలో రూ.700 నుంచి రూ.750 వరకు అమ్మగా, ప్రస్తుతం రూ.800 పలుకుతోంది.  
ఉత్పత్తి తగ్గించిన కంపెనీలు... 
నెలన్నర కిందటి వరకు చికెన్ రేట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తిని కంపెనీలు తగ్గించేశాయి. రేట్లను పెంచేందుకు కంపెనీలు ఏటా ఇలానే చేస్తాయని రైతులు చెబుతున్నారు. మార్కెట్ లో డిమాండ్ సృష్టించి, రేట్లు పెంచుతారని పేర్కొంటున్నారు. రైతులు ఏడాదికి ఆరు బ్యాచుల బ్రాయిలర్ కోళ్లను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ప్రస్తుతం నాలుగు బ్యాచులనే తీస్తున్నారు. సాధారణంగా ఒక్కో బ్యాచ్​లో కోళ్లు ఎదగడానికి 45 రోజుల టైం పడుతుంది. బ్యాచ్ కు బ్యాచ్ కు మధ్య 15 రోజుల గ్యాప్ ఉంటుంది. కానీ ప్రస్తుతం కంపెనీలు ఈ గ్యాప్​ను 40 రోజుల నుంచి 50 రోజులకు పెంచాయి. ఈ విధంగా రైతులకు ఏడాదిలో రెండు కటాఫ్​లను విధిస్తున్నాయి. మహబూబ్​నగర్​ జిల్లాలో ఐదు కంపెనీల నిర్వాహకులు రెండు లక్షల కోళ్ల ఉత్పత్తి కోసం అగ్రిమెంట్​చేసుకొని, ప్రస్తుతం లక్ష వరకు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. కొన్ని ఫారాల్లో ఉత్పత్తి చేస్తూ, మరికొన్ని ఫారాలకు కటాఫ్ విధిస్తున్నారు. ఏటా ఫిబ్రవరి నుంచి మే వరకు కంపెనీలు ఇలానే చేస్తాయని 
రైతులు చెబుతున్నారు. 
సమ్మర్ లో సీన్ రివర్స్ 
సాధారణంగా ఎండాకాలంలో చికెన్‌‌ రేట్లు తగ్గుతాయి. ఎండ వేడికి కోళ్లు చనిపోతాయని, పూర్తి బరువుకు రాకముందే కోళ్లను పౌల్ట్రీ రైతులు అమ్మేస్తుంటారు. దాంతో రేట్లు సాధారణంగానే ఉంటాయి. కానీ ఈసారి సీన్‌‌ రివర్స్ అయింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెప్పాయి. దాణా రేట్లు పెరగడం, ఎండలు ముదిరి వేడికి కోళ్లు చనిపోవడంతో ఉత్పత్తి తగ్గడం కారణమని తెలిపాయి. మార్కెట్‌‌లో ఉన్న డిమాండ్‌‌కు సరిపడా కోళ్ల సరఫరా లేకపోవడంతో రేట్లు పెరుగుతున్నాయని, పరిస్థితి ఇట్లనే ఉంటే కిలో చికెన్ రూ.350 దాటే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 
మాంసం కొనలేం.. 
మటన్‌‌‌‌, చికెన్‌‌‌‌ తినడం అలవాటు. ఇప్పటికే మటన్‌‌‌‌ కిలో రూ.800 దాటింది. చికెన్ రూ.300 అయింది. ఇగ ఏం కొంటం.. ఏం తింటం. మాంసం కొనేటట్టు లేదు. ఏది కొనాలన్న భయమైతంది.  -  బొల్ల శ్యామ్​సుందర్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌
రేటు 350 అయితది.. 
20 రోజుల నుంచి రేట్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎండాకాలంలో రేటు తగ్గాలి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఆదివారం గిరాకీ తగ్గింది. మరికొన్ని రోజుల్లో చికెన్ రూ.350 దాటే అవకాశం ఉంది.  - రాకేశ్, వ్యాపారి  
పిరమైందని తెచ్చుకుంటలేం.. 
నేను ఆటో తోల్త. రోజుకు రూ.300 ‌‌‌‌‌‌‌‌నుంచి రూ.400 సంపాదిస్త. ప్రస్తుతం మా ఊళ్లో చికెన్​కిలో రూ.280, మటన్​ రూ.700 ఉంది. చికెన్ తినాలంటే ఒకరోజు సంపాదన, మటన్ తినాలంటే రెండ్రోజుల సంపాదన పెట్టాలె. మాంసం బాగా పిరమైందని తెచ్చుకుంటలేం.   - ఆంజనేయులు, మిడ్జిల్, మహబూబ్​నగర్ జిల్లా.