పరిణతి చాటిన ప్రజాతీర్పు

పరిణతి చాటిన ప్రజాతీర్పు

పదేండ్ల తేడాతో దేశంలో మళ్లీ సంకీర్ణ పాలనా పర్వం తెరపైకి వచ్చింది. 1991-2014 వరకు దాదాపు పాతికేండ్లు సాగిన సంకీర్ణ శకానికి భిన్నంగా పదేండ్ల పాటు (2014-24) బీజేపీ సొంతంగానే  మెజారిటీ పొందింది. బీజేపీ నేతృత్వం వహించిన ఎన్డీయేది పేరుకు సంకీర్ణ ప్రభుత్వమే అయినా.. అన్నీ తానై జరిపిన బీజేపీ పాలనే ఇన్నాళ్లు సాగింది. సొంతంగా ఏ ఒక్కపార్టీకీ మెజారిటీ లేని ఈ దఫా... ‘మోదీ హామీ’లకు ఎన్డీయే పక్షాలు నిలబడతాయా? ‘సంకీర్ణ ప్రభుత్వాన్ని’ మోదీ నడుపగలరా? అన్నదిపుడు కోటి రూకల ప్రశ్న! మేధావులు, సర్వే సంస్థల అంచనాలకు భిన్నంగా దేశపౌరులు ఎందుకీ ‘సంకీర్ణ తీర్పు’ ఇచ్చారు?  రెండు తెలుగు రాష్ట్రాలదీ ఈసారి విలక్షణ తీర్పే! ఏయే అంశాలు ప్రభావితం చేశాయి? అన్న చర్చ కొనసాగుతోంది.

ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికకు భారత ప్రజాతీర్పులో పరిణతి పెరుగుతోంది. ‘అబ్‌‌ కీ బార్‌‌ చార్‌‌ సౌ పార్‌‌’ అని బీజేపీ  కోటి గొంతుకలతో ప్రచారం చేసినా.. పాలనకు అవసరమైన కనీస మెజారిటీ (272)ని ఆ పార్టీకి ప్రజలివ్వలేదు. 2014లో 282, 2019లో 303 స్థానాలు సొంతంగా నెగ్గిన బీజేపీని ఈసారి 240 స్థానాలకే పరిమితం చేశారు. ఎన్డీయే కూటమికి మాత్రమే మెజారిటీ (293) స్థానాలిచ్చారు. అంటే, అనివార్యమైన సంకీర్ణ పాలన. ఆర్​ఎస్​ఎస్​  నడిపే బీజేపీ ఎజెండాను కాకుండా సంకీర్ణధర్మం పాటించాల్సిందే! సంకీర్ణ సర్కారు నిర్ణయాల మంచిచెడుల సమీక్షకు ‘ఇండియా’ (233) రూపంలో ఓ గట్టి ప్రతిపక్షంగా అవతరించడం ఈ ఎన్నికల్లో నికార్సయిన ఫలితం!  ఇది ప్రజాస్వామ్యానికి మంచిదే. నరేంద్ర మోదీ, పాలనా నాయకత్వానికి ఈ ఫలితాలు ఒక సవాల్‌‌! ఎన్డీయే కూటమి భాగస్వాములకు ఓ చక్కని అవకాశం. రాహుల్‌‌ గాంధీ నేతృత్వపు విపక్షానికి బరువైన బాధ్యత. 

ఉత్తరాదిలో దెబ్బ, దక్షిణాదిలో ఊరట

సానుకూల ప్రచారాలను స్వాగతించిన ప్రజలు ద్వేష భావనలను అంగీకరించలేదు. ఉత్తరాది, పశ్చిమ భారతంలో దెబ్బతింటున్నామని ముందే గ్రహించిన బీజేపీ దక్షిణ, తూర్పు భారతంపై దృష్టి కేంద్రీకరించింది. గండిపడిన స్థాయిలో కాకపోయినా.. కొత్త ప్రాంతాల్లో  దాన్ని కొంతమేర పూడ్చుకోగలిగారు. అది కూడా లేకుంటే బీజేపీ సొంతంగా 200 దాటడం కష్టమయ్యేది. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్‌‌, హర్యానా, పంజాబ్‌‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌‌ తదితర హిందీబెల్ట్‌‌ రాష్ట్రాల్లో బీజేపీకి ఈసారి దెబ్బపడింది. దక్షిణాదిలో  తెలంగాణ (8), ఏపీ (3), కేరళ (1) లో కొంత లబ్ధి చేకూరింది. అడ్డదారి అధికారం కోసం ప్రత్యర్థి పార్టీలను నిలువునా చీల్చడం, సొంతపార్టీలో ప్రత్యర్థి వర్గాలను అణచివేయడం వంటివి ప్రజలు సహించలేదు.

విద్వేష భావనలు చెల్లవు

ఉద్యమించిన రైతు చెమట చిందిన చోట, అవమానపడ్డ కుస్తీ వనితల కన్నీరింకిన నేలన.. బీజేపీ జావగారింది. ఒక పెద్ద మనిషి అన్నట్టు ‘చెంపదెబ్బ ఒక అర్ధసైనిక బలగాల జవానుది కాదు, అవమానానికి గురయిన రైతుమహిళ కూతురిది! తగిలింది ఏ సినీ-రాజకీయ సెలబ్రిటీకో కాదు, పాలనాధికారపు అహంకారానికి’ అని అర్థం చేసుకుంటే, తాజా ఫలితాలు ఎంతో కొంత బోధపడతాయి. హిందూ ఓటు ఏకీకృతం చేయాలని చూసినా, ముస్లింల వ్యతిరేక ప్రచారం వారిని ఏకం చేసింది. 

రిజర్వేషన్ల రద్దు భయమూ ఓడించింది

భవ్య రామమందిరం కట్టిన అయోధ్య నెలవైన ఫైజాబాద్‌‌లోనే బీజేపీ ఓడింది. పార్టీకి 370, కూటమికి 400 పైన ఇవ్వండి అని బీజేపీ ఇచ్చిన పిలుపును ప్రత్యర్థులు గట్టిగా తిప్పికొట్టారు. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అన్నట్టు, ‘400’ కోరిక రిజర్వేషన్లను ఎత్తివేతకు, రాజ్యాంగం రద్దుకు’ అని చేసిన ప్రచారం బలంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. ఫలితంగా, దళితవర్గాల్లో బీజేపీకి పడ్డ ఓటు శాతం ఈసారి గణనీయంగా తగ్గినట్టు ‘సీఎస్‌‌డీఎస్‌‌ లోక్‌‌నీతి’ పోలింగ్‌‌ అనంతర సర్వేలో వెల్లడయింది.

సంకీర్ణమంటే సవాలే!

బలమైన ఒకే పక్షం పాలన మంచిదా? సంకీర్ణ ప్రభుత్వాలు మేలా? అన్నది ఓ ఎడతెగని చర్చ! రెండింటిలోనూ మంచీచెడూ ఉన్నాయి. 1991 నుంచి 2014 వరకు, పి.వి.నర్సింహారావు,  వాజ్‌‌పేయి, మన్మోహన్‌‌సింగ్​లు ప్రధాన మంత్రులుగా, పాతికేండ్లు సంకీర్ణ ప్రభుత్వాలే సాగాయి. 2014 తర్వాత కూడా పేరుకు ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వమే అయినా, మెజారిటీ స్థానాలు సొంతంగా గెలిచిన బీజేపీ, ఒకరకంగా ఏకపక్ష పాలననే అందించింది. సంకీర్ణ ధర్మపు ఛాయలే కనబడలేదు. కానీ, ఇప్పుడు చంద్రబాబు(టీడీపీ), నితీశ్‌‌కుమార్‌‌ (జేడీయూ)ల పై ప్రధానంగా ఆధారపడాల్సివస్తోంది. ఆ ఇద్దరు కూడా సిద్ధాంతపరంగా బీజేపీని అంగీకరించని వారే! ఇక పాలనా విధానాల్లో సారూప్యత-  ఏకాభిప్రాయమే వారిని కట్టి ఉంచాలి. అప్పుడే నితీశ్‌‌ గొంతెత్తారు. అగ్నిపథ్‌‌ సమీక్ష జరగాలని, కులగణన దేశవ్యాప్తం కావాలని కోరుతున్నారు. చంద్రబాబు ఇప్పటికైతే, ఆర్థికంగా కకావికలమైన ఆంధ్రప్రదేశ్‌‌ ‘ఇల్లు చక్కదిద్దుకోవడం’పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. భవిష్యత్తులో ఎలా ఉంటారో? ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌‌కు సర్కారు రక్ష కోరకుండా ఉంటారా? చూడాలి. ఇద్దరివీ కూడా, ప్రజాదరణతో నడిపే అవకాశవాద రాజకీయాలే తప్ప, వారు విశ్వసనీయత ధృవపడ్డ నాయకులు కాదు. 

సొంత నిర్ణయాలు చెల్లేనా?

వీరిని నమ్మి, మోదీ నిశ్చింతగా ఉండగలరా? ఏకరీతి పౌరస్మృతి, ఒకదేశం-ఒక ఎన్నిక, సీఏఏ వంటి వివాదాంశాలతో ఆర్​ఎస్​ఎస్​ నడిపే బీజేపీ ఎజెండాను ఎన్డీయే కూటమి సమ్మతిస్తుందా? మోదీ ఎడాపెడా ఇచ్చిన హామీల అమలుకు సహకరిస్తుందా? వేచి చూడాలి. దశాబ్దం దేశ ప్రధానిగా, పుష్కరకాలం గుజరాత్‌‌ సీఎం గా ఇష్టారీతి పాలనచేసిన మోదీ.. చిన్నా చితకా పార్టీలను విశ్వాసంలోకి తీసుకుంటూ సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థంగా నడుపగలరా? 

తెలంగాణలో ఈ ఊపును బీజేపీ నిలుపుకోగలదా?

తెలంగాణ సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నట్టు బీఆర్‌‌ఎస్‌‌ తన పార్టీ శ్రేణుల్ని బీజేపీకి తాకట్టు పెట్టిందా? లేదా? అన్నది తెలియదు. కానీ, ఈ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ ఇంకొంచెం గట్టిగా నిలబడి ఉంటే, బీజేపీ కన్నా కాంగ్రెస్‌‌కు ఒకటి, రెండు స్థానాలైనా ఎక్కువ వచ్చి ఉండేవే! ఒకటి ఎంఐఎంకి పోను, చెరి 8 స్థానాలు ప్రజలు సమానంగా ఇచ్చారు. ఉప ఎన్నికలు గెలవటం, అసెంబ్లీ అసలు ఎన్నికల్లో ఓడటం, మళ్లీ ఎంపీ స్థానాలు నెగ్గటం.. బీజేపీది తెలంగాణలో బలుపా, వాపా తేలకుండా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌‌ పార్టీకి ఊపు తెచ్చిన మాట వాస్తవం. ఆయన్ని తప్పించాక పార్టీ బలహీనపడింది. 

విపక్షమే ఉండొద్దా?

 ‘కాంగ్రెస్‌‌ పార్టీయే లేని దేశం’ (కాంగ్రెస్‌‌ ముక్త్‌‌ భారత్‌‌) అని బీజేపీ నినాదం ఎత్తుకున్నప్పటి నుంచి, కాంగ్రెస్‌‌ క్రమంగా ఎదుగుతోంది. ‘భారత్‌‌ జోడో’ యాత్ర తర్వాత రాహుల్‌‌ గాంధీ ప్రతిష్ట, జనాదరణ పెరిగింది. ప్రధాని అభ్యర్థిగా ప్రజాభిప్రాయంలో మోదీ, రాహుల్‌‌ మధ్య అంతరం తగ్గింది. ఎన్డీయేలో బీజేపీది 80 శాతం వాటా అయితే ‘ఇండియా’లో  కాంగ్రెస్‌‌ వాటా దాదాపు 40 శాతమే! ఎన్డీయే చోదకశక్తి బీజేపీ సొంత బలమే, 63 స్థానాలు తగ్గాయి.  విపక్ష చోదకశక్తి కాంగ్రెస్‌‌, 52 నుంచి ఈసారి 99కి పెరిగింది. భాగస్వామ్య పక్షాలూ ముఖ్యంగా ఎస్పీ, టీఎంసీ, మహారాష్ట్ర చీలిక గ్రూపులు తమ పరిస్థితిని మెరుగుపరుచుకున్నాయి. తమిళనాడులో విపక్షకూటమి మరింత బలప‌‌డింది.

ఏపీలో పెత్తందారీతనం ఓడింది

ఇక ఏపీ విషయానికి వస్తే, కూటమి సయోధ్య వల్లే 3 లోక్​సభ, 8 అసెంబ్లీ స్థానాలు దక్కాయి తప్ప బీజేపీకి సొంతంగా బలం లేదు. ‘దేశంలో ఎక్కడా లేనంత సంక్షేమం చేశాం మాకు తిరుగులేదు’ అనుకున్న వైఎస్సార్సీపీ బొక్కబోర్లా పడింది. ‘సమాజంలో అసమానతలు అసాధారణంగా ఉన్నంతకాలం, సంక్షేమం ప్రజల హక్కు ప్రభుత్వాల బాధ్యత తప్ప ఒక నాయకుడి బిక్ష, దయాదాక్షిణ్యాలు కాదు’ అని చెంప చరిచి మరీ చెప్పారు. ప్రజలు కోరినా అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం, ఒంటెద్దు పోకడ, పాలకపక్ష పెత్తందారీతనానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తంమ్మీద ఈసారి ఓటరుది స్వాగతించదగ్గ  పరిణతే!

- దిలీప్​రెడ్డి, పొలిటికల్​ ఎనలిస్ట్​,
పీపుల్స్​పల్స్​ రీసెర్చ్ ​సంస్థ