మేడారం బస్సుల్లో కోళ్లు, గొర్లకు నో ఎంట్రీ : వీసీ సజ్జనార్​

మేడారం బస్సుల్లో కోళ్లు, గొర్లకు నో ఎంట్రీ : వీసీ సజ్జనార్​

హనుమకొండ, వెలుగు : మేడారం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో కోళ్లు, మేకలు, గొర్లకు ఎంట్రీ లేదని టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​స్పష్టం చేశారు. మేడారం జాతరకు భక్తులను తరలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపిస్తున్నట్లు చెప్పారు. వరంగల్ లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఆదివారం మేడారం జాతర సన్నద్ధత సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మహాలక్ష్మి స్కీం కింద మేడారం బస్సుల్లో సుమారు 30 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు అన్ని సెంటర్లతో పాటు మేడారంలో కూడా ఏర్పాట్లు చేశామన్నారు. యాక్సిడెంట్ ఫ్రీ జాతరకు డ్రైవర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మేడారం మహాజాతర కోసం సుమారు 15 వేల మంది సిబ్బంది డ్యూటీ చేస్తున్నారని, వారికి వసతి సౌకర్యం, భోజనం రాజీ పడొద్దని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం మేడారం జాతరలో డ్యూటీ చేసే ఆర్టీసీ సిబ్బంది కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన టీ షర్ట్ లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ సీవోవో రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, రఘునాథ రావు పాల్గొన్నారు.