మేడారానికి 8 రోజుల పాటు 6 వేల బస్సులు

మేడారానికి 8 రోజుల పాటు 6 వేల బస్సులు
  •    మేడారానికి వెళ్లే భక్తుల కోసం నడుపుతున్నం: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రజలు సహకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  కోరారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఈనెల 21 నుంచి 24 వరకు మేడారం మహా జాతర జరుగుతుండగా.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 18 నుంచి 25 వరకు 6 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోందని చెప్పారు.

గతంలో నడిపిన దాని కన్నా ఈసారి అదనంగా  బస్సులు జాతరకు వెళ్తుండడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో సాధారణ ప్రయాణికులకు రెగ్యులర్  బస్సులు తగ్గే అవకాశం ఉంది. ప్రజలు అసౌకర్యానికి గురికావద్దు. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో దాదాపు 40 లక్షల మంది వరకు భక్తులు ఆర్టీసీ బస్సుల్లో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారని అంచనా వేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈనెల 18  నుంచి 25 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, హైదరాబాద్  నగరం నుంచి మేడారం జాతరకు బస్సులు నడపుతున్నాం” అని పొన్నం తెలిపారు.