సర్కారు స్కూళ్లలో సబ్జెక్ట్​ టీచర్లు లేరు.. టెన్త్​ క్లాస్​ పరీక్షల రిజల్ట్ పై ప్రభావం

సర్కారు స్కూళ్లలో సబ్జెక్ట్​ టీచర్లు లేరు.. టెన్త్​ క్లాస్​ పరీక్షల రిజల్ట్ పై ప్రభావం
  • కుంటుపడుతున్న బోధన
  • సబ్జెక్ట్ టీచర్లు లేక స్టూడెంట్స్ కు నష్టం
  • సింగిల్ ​టీచర్ ​లీవ్​ పెడితే స్కూల్​ బందే!
  • రెగ్యులర్​ హెచ్ఎంలు కరువు
  • నిర్వహణ, బోధనలో తప్పని ఇబ్బందులు

మెదక్/ రేగోడ్, వెలుగు: సర్కారు స్కూళ్లలో టీచర్​పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. దీంతో గవర్నమెంట్ స్కూళ్లల్లో బోధన కుంటుపడుతోంది. ప్రధానంగా హైస్కూళ్లల్లో మాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్లు లేక స్టూడెంట్స్ వెనుకబడుతున్నారు. ఫలితంగా టెన్త్ వార్షిక పరీక్షల రిజల్ట్ పై ప్రభావం చూపుతోంది. ప్రైమరీ స్కూళ్లల్లో అయితే ఎస్జీటీ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీ ఉన్నాయి. సింగిల్ టీచర్ ఉన్న స్కూల్లో వారు ఏదైనా పనిమీద లీవ్ పెడితే స్కూల్ ను బంద్ చేసే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క హెడ్ మాస్టర్ పోస్టు కూడా లేదు. ఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో స్కూళ్ల నిర్వహణకు ఇబ్బందికరంగా మారింది. సీనియర్ టీచర్లకు ఇన్​చార్జి హెచ్ఎం బాధ్యతలు అప్పగిస్తుండడంతో స్టూడెంట్స్​కు పాఠాలు బోధించడం, స్కూల్ నిర్వహణ వారికి భారంగా మారింది. 

మెదక్ జిల్లాలో 628 ఖాళీలు...

జిల్లా వ్యాప్తంగా హైస్కూల్, యూపీఎస్, ప్రైమరీ స్కూళ్లల్లో కలిపి మొత్తం టీచర్ పోస్టులు 3,990 ఉండాలి. కాగా 3,362 మంది ఉన్నారు. ఇవి పోను ఆయా స్కూళ్లల్లో అన్ని కేటగిరీలవి కలిపి 628 టీచర్ పోస్ట్ లు ఖాళీ ఉన్నాయి. గ్రేడ్​–-2 హెడ్ మాస్టర్ పోస్టులు74, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెలుగు మీడియం 45, ఉర్దూ మీడియం 2, ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం 22, ఉర్దూ మీడియం 3, బయోసైన్స్ తెలుగు మీడియం 56 , ఉర్దు మీడియం 3, సోషల్ స్టడీస్ తెలుగు మీడియం78, ఉర్దూ మీడియం 2, తెలుగు 15, హిందీ13, ఇంగ్లీష్36, ఉర్దూ2, పీఈటీ పోస్టులు7 ఖాళీగా ఉన్నాయి. ప్రైమరీ స్కూళ్లల్లో హెచ్ఎం పోస్టులు58, లాంగ్వేజ్ పండిత్ తెలుగు13, హిందీ15, ఉర్దూ2, ఎస్జీటీ పోస్టులు133, ఉర్దూమీడియం20, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ పోస్టులు12, క్రాఫ్ట్ టీచర్ పోస్టులు16, మ్యూజిక్ టీచర్ ఒకటి పోస్టు ఖాళీగా ఉంది. 

సిద్దిపేట జిల్లాలో ఇదీ పరిస్థితి...

జిల్లాలో 650 టీచర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. వీటిలో ఎస్జీటీ150, హెచ్ఎంలు69, ఎస్ఏలు 431పోస్టులు ఖాళీగా ఉండగా, సోషల్ సబ్జెక్టులో70, సైన్స్ లో30, మిగిలినవి ఇతర సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. వీటిలో ప్రమోషన్ల ద్వారా 400 పోస్టులను మిగిలిన 250 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్​మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు20కి పైగా సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఈ కారణంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు బోధించేందుకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

సంగారెడ్డి జిల్లాలోనూ...

జిల్లాలో మొత్తం910 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గెజిటెడ్ హెచ్ఎం264, స్కూల్ అసిస్టెంట్(సోషల్) 90, స్కూల్ అసిస్టెంట్(బయోసైన్స్)61, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్18, హిందీ7, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్16, ఫిజికల్ సైన్స్11, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం100, ఎస్జీటీ258, ఉర్దూ150 ఖాళీగా ఉన్నాయి. వీటికి అదనంగా ఉర్దూ, కన్నడ, పీఈటీ,  నల్ ఇన్​స్ట్రక్టర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, రిసోర్స్ టీచర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. 

టీచర్లు లేక పాఠాలు చెప్తున్నా..

రేగోడ్ మండలంలో రెండు క్లస్టర్స్ ఉన్నాయి. నేను పని చేస్తున్న క్లస్టర్ లో10 ప్రైమరీ స్కూల్స్ సింగిల్ టీచర్స్ స్కూళ్లు నడుస్తున్నాయి. ఎవరైనా టీచర్ సెలవులో వెళితే వర్క్ అడ్జస్ట్​మెంట్ చేయడం ఇబ్బందిగా మారింది. పోయిన సంవత్సరం నుంచి నేను దాదాపు ప్రతి రోజు అవసరమైన స్కూల్ లో స్టూడెంట్స్ కు పాఠాలు చెప్తున్నా.

రవినాయక్, సీఆర్పీ, రేగోడ్