మేడిగడ్డలో పది పిల్లర్లు మళ్లా కట్టాల్సిందే

మేడిగడ్డలో పది పిల్లర్లు  మళ్లా కట్టాల్సిందే
  • నేషనల్ ​డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ప్రాథమిక అంచనా
  • జలసౌధలో ఈఎన్సీలు, ఇతర ఇంజినీర్లతో భేటీ
  • బ్యారేజీ నిర్మాణ తీరుపై ప్రశ్నలేసిన అథారిటీ చైర్మన్ అనిల్​ జైన్​
  • నేడు కేంద్ర జలశక్తి శాఖకు రిపోర్ట్​ చేసే చాన్స్​
  • అండర్​ మైనింగ్​తోనే సమస్య.. డిజైన్​లో లోపం లేదు: ఈఎన్సీ మురళీధర్​
  • నష్టాన్ని భరించి, పునరుద్ధరణ పనులు చేస్తామన్న ఎల్​ అండ్​ టీ

హైదరాబాద్, వెలుగు:  మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్​లోని పది పిల్లర్లను పూర్తిగా తొలగించి, కొత్తగా నిర్మించాల్సిందేనని నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. దీనిపై గురువారం కేంద్రం జలశక్తి శాఖకు రిపోర్ట్​ చేసే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్​లో కుంగిన 19, 20 పిల్లర్లు సహా మిగతా పిల్లర్లను మంగళవారం పరిశీలించిన డ్యామ్​సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ ​జైన్​ నేతృత్వంలోని టీమ్​ బుధవారం హైదరాబాద్​ జలసౌధలో ఇరిగేషన్​ ఈఎన్సీలు, ఇతర ఇంజినీర్లతో సమావేశమైంది. ఏడో బ్లాక్​లో మొత్తం 11 పిల్లర్లు ఉండగా.. వాటిలో పది తొలగించాల్సిందే నని డ్యామ్​సేఫ్టీ అథారిటీ అంచనాకు వచ్చింది. దీనిపైనే రాష్ట్ర ఇంజినీర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగి సమాచారం సేకరించింది. 

‘గోదావరిపై మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించే ముందు అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్​ చేశారా?’ అని రాష్ట్ర ఇరిగేషన్​ ఇంజినీర్లను అనిల్​ జైన్​ ప్రశ్నించారు. బ్యారేజీ నిర్మాణానికి ముందు చేసిన ఇన్వెస్టిగేషన్స్​ రిపోర్టులు, డిజైన్లు, డ్రాయింగ్​లు ఇవ్వాలన్నారు. ‘ఏడో బ్లాక్​లో ఎక్కువగా డ్యామేజీ జరగడానికి కారణాలు ఏమిటి..? నిర్మాణ సమయంలో ఏయే జాగ్రత్తలు తీసుకున్నారు..? ఎంత డిశ్చార్జ్​ కెపాసిటీతో బ్యారేజీ నిర్మించారు?’ అనే వివరాలు రాబట్టారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్​రావు, నల్లా వెంకటేశ్వర్లు, శంకర్, సీఈ (సీడీవో) మోహన్​కుమార్, సీఎం ఓఎస్డీ  శ్రీధర్​ దేశ్​పాండే, ఎల్​ అండ్​టీ సంస్థ ప్రతినిధులు పాల్గొని.. కేంద్ర బృందం అడిగిన పలు డాక్యుమెంట్లు సమర్పించారు. 


వర్క్​సైట్​గా మేడిగడ్డను నిర్ణయించడానికి ముందే అన్ని రకాల పరిశోధనలు చేశామని రాష్ట్ర ఇంజినీర్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన డిజైన్​కు లోబడే బ్యారేజీ నిర్మించామని, ఇందులో ఎలాంటి లోపాలు లేవని ఎల్​అండ్​టీ ప్రతినిధులు తెలిపారు.  బ్యారేజీ నిర్మించి ప్రభుత్వానికి అప్పగించిన నాటి నుంచి ఐదేండ్లపాటు డిఫెక్ట్​లయబులిటీ పీరియడ్​ఉంటుందని, ఈ నేపథ్యంలో బ్యారేజీకి ఎలాంటి రిపేర్లు చేయాల్సి వచ్చినా దానికి తమదే బాధ్యత అని చెప్పారు. ఇంజినీర్లతో పాటు ఎల్​అండ్​టీ ప్రతినిధులు చెప్పిన వివరాలను నోట్​చేసుకున్న డ్యామ్​సేఫ్టీ అథారిటీ చైర్మన్, సభ్యులు బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిపోయారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడంపై డ్యామ్​సేఫ్టీ అథారిటీ ఇంజినీర్లు గురువారం జలశక్తి శాఖకు ప్రాథమిక నివేదిక ఇచ్చే అవకాశముంది.

అండర్​ మైనింగ్​తోనే సమస్య: ఈఎన్సీ(జనరల్​) మురళీధర్

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ డిజైన్​లో ఎలాంటి లోపం లేదని ఇరిగేషన్​ ఈఎన్సీ (జనరల్) మురళీధర్​ అన్నారు. నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ఇంజనీర్లతో సమావేశం అనంతరం బుధవారం జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడంపై డ్యామ్​ సేఫ్టీ అథారిటీ వాళ్లు స్టడీ చేస్తున్నారని, ఇంకా ప్రిలిమినరీ రిపోర్టు సిద్ధం కాలేదని అన్నారు. బ్యారేజీ ఫౌండేషన్​లో అండర్​ మైనింగ్ జరిగినట్టుగా తాము ప్రాథమిక అంచనాకు వచ్చామని చెప్పారు. నిరుడు వరద పోటెత్తడంతో పిల్లర్ల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి అవతలి వైపు మేట వేసిందని, దీనితోనే కుంగినట్టుగా అనుమానిస్తున్నామని పేర్కొన్నారు.  నీటిని పూర్తిగా మళ్లించి పరిశీలిస్తే తప్ప దీనిపై క్లారిటీకి రాలేమన్నారు. డిజైన్​ లోపమేది లేదని, ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చని చెప్పారు. డిజైన్​ లోపం జరిగి ఉంటే ఫస్ట్​ సీజన్​లోనే తెలిసిపోయేదన్నారు. నిరుడు అంత పెద్ద వరదను హ్యాండిల్​ చేసిందంటే డిజైన్​లో లోపం లేదని స్పష్టమవుతున్నదని ఆయన పేర్కొన్నారు. బ్యారేజీ డిజైన్​కు కావాల్సిన అన్ని పారామీటర్స్​ ఫాలో అయ్యామని, అండర్​ గ్రౌండ్​ లో స్ట్రాంగ్​ ఫౌండేషన్​ వేశారని తెలిపారు. 

అంత చేసినా ఎక్కడో చిన్న ఓవర్​ లుక్​ అయ్యే చాన్స్​ ఉంటుందని, అది ఏం జరిగిందనే దానిపై డీటైల్డ్​ స్టడీ చేస్తున్నామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఒక పిల్లర్​ కుంగిపోయిందని, దీనిపై  డ్యామ్​ సేఫ్టీ అథారిటీ చీఫ్, వాళ్ల ఇంజనీర్ల బృందం ఫీల్డ్​ విజిట్​ చేసిందని తెలిపారు. జరిగిన నష్టాన్ని తామే భరించి పునరుద్ధరణ పనులు చేస్తామని ఎల్​ అండ్​ టీ వాళ్లు సమావేశంలో చెప్పారని ఆయన అన్నారు. బ్యారేజీలో ఉన్న నిల్వ నీటిని పూర్తిగా ఖాళీ చేశామని, ఎగువ నుంచి వస్తున్న కొద్ది పాటి వరదను డైవర్ట్​ చేసి డ్యామేజ్​అయిన ఏరియా ఐసోలేట్​ చేసి పునరుద్ధరణ పనులు వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఎండాకాలంలోనే ఈ పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.