అవును.. నేనే చంపేశా: పోలీసుల విచారణలో భర్త రాజాను చంపినట్లు ఒప్పుకున్న సోనమ్

అవును.. నేనే చంపేశా: పోలీసుల విచారణలో భర్త రాజాను చంపినట్లు ఒప్పుకున్న సోనమ్

భోపాల్: రాజా రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని తానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో సోనమ్ ఒప్పుకుంది. రాజా మర్డర్ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు సోనమ్ అంగీకరించిందని ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్ అధికారులు బుధవారం (జూన్ 11) వెల్లడించారు. 

కేసుకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాలను ముందు పెట్టి ప్రశ్నించడంతో చేసేదేమి లేక పోలీసుల ముందు సోనమ్ నేరం అంగీకరించింది. తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి సోనమ్ ఈ హత్యకు ముందే పథకం వేసిందని.. ఇందులో భాగంగానే భర్త రాజా రఘువంశీని హనీమూన్‎కు షిల్లాంగ్ తీసుకెళ్లి అక్కడ హత్య చేశారని పోలీసులు వెల్లడించారు.

వివాహం జరిగిన నాలుగు రోజులకే సోనమ్ తన తల్లి ఇంటికి తిరిగి వెళ్లి.. అక్కడ ప్రియుడి రాజ్‌తో కలిసి మర్డర్ ప్లాన్ చేసిందని తెలిపారు. రాజ్ కుష్వాహా స్నేహితులు విశాల్, ఆనంద్, ఆకాష్  తన భర్త రాజాను చంపలేకపోతే.. ఫోటో తీస్తాననే నెపంతో అతన్ని కొండ ప్రాంతానికి తీసుకెళ్లి చంపేస్తానని సోనమ్ ప్రియుడు రాజ్‎తో చెప్పిందని పోలీసులు వెల్లడించారు. ఒకవేళ రాజా రఘువంశీ హత్య విషయం బయటపడితే నేపాల్‌కు పారిపోవాలని కూడా ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారని తెలిపారు పోలీసులు. 

అసలేం జరిగింది? 

మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బిజినెస్‌‌‌‌‌‌‌‌మెన్ రాజా రఘువంశీకి అదే సిటీకి చెందిన బిజినెస్‌‌‌‌‌‌‌‌మెన్ దేవీసింగ్ రఘువంశీ కుమార్తె సోనమ్‌‌‌‌‌‌‌‌తో గత నెల 11న వివాహం జరిగింది. అదే నెల 20న రఘువంశీ, సోనమ్ మేఘాలయాకు హనీమూన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. 22న స్కూటర్ రెంట్‌‌‌‌‌‌‌‌కు తీసుకుని మౌలఖియాట్‌‌‌‌‌‌‌‌ అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి కనిపించకుండాపోయారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొత్త జంట జాడ కనిపెట్టేందుకు మేఘాలయా ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది. 

ఈ క్రమంలో జూన్ 2న ఓ జలపాతం దగ్గర లోయలో రాజా రఘువంశీ డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ దొరికింది. అతని గోల్డ్ రింగ్, చైన్‌‌‌‌‌‌‌‌ మిస్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత స్పాట్‌‌‌‌‌‌‌‌కు దగ్గర్లోనే రక్తపు మరకలు ఉన్న కత్తి, రెయిన్ కోట్‌‌‌‌‌‌‌‌ దొరికింది. రఘువంశీ హత్యకు గురైనట్టు భావించిన పోలీసులు.. ఆయన భార్య సోనమ్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని వారణాసి, ఘాజీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవేపై ఆమె ఉన్నట్టు సమాచారం రావడంతో యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కిరాయి గుండాలతో భర్తను తానే హత్య చేసినట్లు సోనమ్ పోలీసుల విచారణలో ఒప్పుకుంది.